సింగ్‌ బ్రదర్స్‌కు సుప్రీంకోర్టు మరో షాక్‌

SC holds ex Ranbaxy Singh brothers guilty of contempt - Sakshi

రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లపై కోర్టు ధిక్కరణ పిటీషన్‌ను సమర్ధించిన సుప్రీం

  సోదరులిద్దరికీ  భారీ జరిమానా

ఓపెన్‌ ఆఫర్‌పై  స్టే ఎత్తివేతకు నిరాకరణ

సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ఔషధ తయారీ సంస్థ రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ మోహన్‌ సింగ్‌, శివీందర్‌ సింగ్‌లకు సుప్రీంకోర్టు మరోసారి భారీ షాక్‌ ఇచ్చింది. జపాన్‌ ఫార్మా దిగ్గజం దైచీ శాంకో దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటీషన్‌ను సమర్ధించింది. ఈ విషయంలో ఇప్పటికే సోదరులిద్దరికీ చివాట్లు పెట్టిన అత్యున్నత ధర్మాసనం తాజాగా సీరియస్‌గా స్పందించింది. సింగ్ సోదరులు తమ ఆదేశాన్ని ఉల్లంఘించి కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు సుప్రీం స్పష్టం చేసింది. ఇందుకు సోదరులిద్దరూ ఒక్కొక్కరూ రూ. 1175 కోట్ల రూపాయలు జమ చేయాలని ఆదేశించింది. అలాగే ఫోర్టిస్‌ ఐహెచ్‌హెచ్‌ ఓపెన్ ఆఫర్‌పై స్టే ఎత్తివేయడానికి నిరాకరించింది. ఫోర్టిస్‌కు వ్యతిరేకంగా సుమోటో ధిక్కారాన్ని ప్రారంభించింది. తదుపరి విచారణలో ఓపెన్‌ ఆఫర్‌పై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.

కాగా 2008లో రాన్‌బాక్సీని దైచీ కొనుగోలు చేసింది. అయితే కంపెనీపై అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ దర్యాప్తు చేపడుతోందన్న నిజాన్ని దాచిపెట్టి రాన్‌బాక్సీ షేర్లను సింగ్‌ సోదరులు విక్రయించారంటూ దైచీ సంస్థ సింగపూర్‌ ఆర్బిట్రేషన్‌ ట్రైబ్యూనల్‌ను ఆశ్రయించింది. దీనిపై విచారణ అనంతరం సింగ్‌ సోదరులు దైచీ సంస్థకు రూ .3500 కోట్ల చెల్లించాలని 2016లో ఆదేశించింది. అయితే  ఆమొత్తాన్ని చెల్లించక పోవడంతో దైచీ భారత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన సుప్రీం  సింగ్‌ సోదరులు దైచీకి డబ్బులు చెల్లించాల్సిందేనని 2019 మార్చి 14న స్పష్టం చేసింది. అనంతరం సింగ్‌ బ్రదర్స్‌ సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీం..కోర్టు దిక్కరణకు పాల్పడినట్లయితే జైలుకు పంపిస్తామని హెచ్చరిస్తూ, 2019, ఏప్రిల్‌లో తీర్పును రిజర్వులో ఉంచింది. ఇది ఇలా వుంటే వేలకోట్ల నిధుల మళ్లింపు ఆరోపణలతో గత నెలలో సింగ్‌ బ్రదర్స్‌ను ఢిల్లీ  ఆర్థిక నేరాల విభాగం పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. 
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top