కార్డన్‌ సెర్చ్‌లో దుప్పి కొమ్ములు గుర్తింపు

Sandalwood And Animal Horns Find in Cardon Search Prakasam - Sakshi

కొమరోలు(గిద్దలూరు): కార్డన్‌ సెర్చ్‌లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు అక్కడి ఇళ్లలో గుర్తించిన అడవి జంతువుల కొమ్ములు, ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నాటు సారా అరికట్టేందుకు శుక్రవారం మండలంలోని ఎర్రగుంట్ల గ్రామంలో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. వేకువజామునే గ్రామానికి చేరుకున్న గిద్దలూరు సర్కిల్‌ పరిధిలోని ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది గ్రామంలో అణువణువూ పరిశీలించారు. రాకపోకలు సాగిస్తున్న వాహనాలను ఆపి పత్రాలను, డ్రైవింగ్‌ లైసెన్స్‌లను పరిశీలించారు. పత్రాలు సక్రమంగా లేని 10 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

గ్రామంలో అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. అదేవిధంగా గ్రామంలోని పలు గృహాల్లో తనిఖీలు నిర్వహించగా 11 దుప్పి కొమ్ములు, మూడు చిన్నపాటి ఎర్రచందనం దుంగలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు వివిధ అవసరాల కోసం ఉపయోగించే కత్తులు, గొడ్డళ్లు స్వాధీనం చేసుకున్నారు. దుప్పికొమ్ములు, ఎర్రచందనం దుంగలను అటవీ శాఖ అధికారులకు అప్పగించామని సీఐ యు.సుధాకర్‌రావు చెప్పారు. ఇలాంటి వాటిని కలిగి ఉండటం చట్ట విరుద్దమన్నారు. కార్యక్రమంలో కొమరోలు, గిద్దలూరు, రాచర్ల, బేస్తవారిపేట ఎస్‌ఐలు ఎస్‌.మల్లికార్జునరావు, షేక్‌ సమందర్‌వలి, త్యాగరాజు, రవీంద్రారెడ్డి, ఎక్సైజ్‌ ఎస్సై రాజేంద్రప్రసాద్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండే ఇక్కడి ప్రజలు ఎర్రచందనం దుంగలతో రోకళ్లు, పచ్చడి బండలు తయారు చేసుకుని ఉపయోగిస్తారని, దుప్పి కొమ్ములను శుభ సూచకంగా ఇళ్లలో అలంకరిస్తారని స్థానికులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top