పొట్టకూటి కోసం వెళ్తుండగా..

Road Accident In Nellore - Sakshi

చిట్టమూరు(నెల్లూరు): ఎదురుగా వస్తున్న మోటారుసైకిల్‌ను తప్పించే క్రమంలో రొయ్యల కంపెనీ వ్యాన్‌ అదుపుతప్పి బోల్తాపడడంతో పొట్టకూటి కోసం కంపెనీలోకి పనికి వెళ్తున్న 29 మంది మహిళా కూలీలు గాయపడ్డారు. ఈ ఘటన మండలంలోని మల్లాం సమీపంలో ఆదివారం వేకువన చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. కోట మండలం చెందోడు వద్ద  ఉన్న సాగర్‌ గాంధీ ఎక్స్‌పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (జీవీఆర్‌) రొయ్యల కంపెనీలో పనికి వాకాడు మండలం వాలమేడు, వైట్‌ కుప్పం తదితర గ్రామాలకు చెందిన మహిళా కూలీలు నిత్యం వెళ్తుంటారు. రోజూలాగే ఆదివారం వేకువన 29 మంది మహిళలు కంపెనీ వ్యాన్‌లో పనికి బయలుదేరారు. మండలంలోని తిరుమూరు గ్రామానికి వెళ్లే మలుపు వద్దకు వ్యాన్‌ వచ్చేసరికి ఎదురుగా మోటారు సైకిల్‌ వచ్చింది. డ్రైవర్‌ మోటారు సైకిల్‌ను తప్పించబోగా వ్యాన్‌ అదుపుతప్పి ఒక్కసారిగా తిరగబడి పోయింది.

ఈ ప్రమాదంలో వ్యాన్‌లోని 29 మంది మహిళలు కాళ్లు, చేతులు విరిగి తీవ్రంగా గాయపడ్డారు. మహిళల అరుపులను విన్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని గాయాలు పాలైన వారిని వ్యాన్‌లో నుంచి బయటకు తీసి ఆటోల్లో మల్లాం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్స అందించారు.  108కు ఫోన్‌ చేసినా సకాలంలో స్పందించలేదని  గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఘటన జరిగిన గంట తర్వాత రెండు 108 వాహనాలు మల్లాం ప్రభుత్వ వైద్యశాలకు వచ్చాయి. తీవ్రంగా గాయపడిన వారిని ప్రథమ చికిత్స అనంతరం గూడూరు వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న మహిళలను నెల్లూరు వైద్యశాలకు తరలించినట్లు సమాచారం.  చిట్టమూరు ఎస్సై వేణుగోపాల్‌ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరాతీశారు. వ్యాన్‌ డ్రైవర్‌ను విచారించి వివరా>లు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.   
పరిమితికి మించి కూలీలను ఎక్కించడంతోనే..
జీవీఆర్‌ కంపెనీకు చెందిన వ్యాన్‌ సీటింగ్‌ కెపాసిటీ 15 మంది కాగా, పరిమితికి మించి ఎక్కించడంతో ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు, పోలీసులు చెబుతున్నారు. ప్రమాదంలో గాయపడిన కూలీలకు వైద్యం అందించి కంపెనీ ఆదుకోవాలని కోరారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top