షేక్‌పేట ఆర్‌ఐ వంశీ సస్పెన్షన్‌

RI Vamshi Suspended in Hyderabad - Sakshi

బంజారాహిల్స్‌: కల్యాణ లక్ష్మి చెక్కును లబ్ధిదారుడికి ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్‌ చేసినందుకుగాను  షేక్‌పేట మండల కార్యాలయంలో పని చేస్తున్న రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ వంశీని సస్పెండ్‌ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. 19 కళ్యాణలక్ష్మి చెక్కులను తన వద్ద ఉంచుకున్న ఆర్‌ఐ వాటిని లబ్ధిదారులకు ఇవ్వకుండా డబ్బుల కోసం వేధిస్తుండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల కోడ్‌ కొనసాగుతున్న నేపథ్యంలో కళ్యాణలక్ష్మి చెక్కులను నేరుగా లబ్ధిదారులకు ఇవ్వకుండా తన వద్ద పెట్టుకోవడంతో పాటు దళారుల సహాయంతో డబ్బులు దండుకునేందుకు యత్నించినట్లు వాయిస్‌ రికార్డ్‌తో సహా ఫిర్యాదులు అందడంతో విచారణ చేపట్టిన షేక్‌పేట తహసీల్దార్‌ వెంకట్‌రెడ్డి ఇచ్చిన నివేదిక ఆధారంగా హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ మాణిక్యరాజ్‌ అతడిని సస్పెండ్‌ చేస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాదిగా  ఆర్‌ఐ వంశీపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి.

ఫిలింనగర్‌ బస్తీల్లో విలువ చేసే ప్రభుత్వ స్థలాలను అన్యాక్రాంతం చేసి భారీగా డబ్బులు దండుకున్నట్లు ఫిర్యాదులు అందాయి. తాజాగా  ఉదయ్‌నగర్‌కు చెందిన రమ్య అనే యువతికి గతేడాది మే6న వివాహం జరిగింది. కల్యాణ లక్ష్మి కోసం దరఖాస్తు చేసుకోగా చెక్కు మంజూరైనట్లు రమ్య సోదరుడు రాజ్‌కుమార్‌కు సమాచారం అందింది. దీంతో అతను చెక్కు ఇవ్వాలని కోరుతూ ఆర్‌ఐ వంశీని సంప్రదించగా రెండు రోజుల్లో బ్యాంకుల్లో డిపాజిట్‌ అవుతుందని చెప్పాడు. కార్యాలయం చుట్టూ తిరిగినా చెక్కు ఇవ్వలేదు. ఈ విషయాన్ని అదే బస్తీకి చెందిన టీడీపీ నేత బాలాజిగోస్వామికి చెప్పడంతో డబ్బులిస్తే తాను మాట్లాడి చెక్కు ఇప్పిస్తానని చెప్పాడు. బాధితుడు ఇదే విషయాన్ని తహసీల్దార్‌ దృష్టికి తీసుకెళ్లగా, తహసీల్దార్‌ విచారణ చేపట్టారు. ఇటీవల 22 చెక్కులు మంజూరు కాగా అందులో మూడు చెక్కులు మాత్రమే లబ్దిదారులకు అందజేసినట్లు తేలింది. మిగిలిన చెక్కులు తన దగ్గరే ఉంచుకొని డబ్బులు డిమాండ్‌ చేసినట్లు వెల్లడి కావడంతోఆర్‌ఐ వంశీని సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top