విశ్రాంతి ఐఏఎఫ్‌ అధికారి ఆత్యహత్య.. చిదంబరంపై విమర్శలు

A Retired IAF Person Committed Suicide In Allahabad and Left Suicide Note Modi - Sakshi

లక్నో: ‘నా కుమారుడి కోసం ఏం చేయలేకపోతున్నాను.. ఉద్యోగ విరమణ తర్వాత ఎన్నో వ్యాపార ప్రయత్నాలు చేశాను. కానీ అవేవీ ఫలించలేదు. ఇందుకు యూపీఏ ప్రభుత్వం, మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం నిర్ణయాలే కారణం’ అంటూ ఓ విశ్రాంత ఐఏఎఫ్‌ అధికారి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. అస్సాంకు చెందిన బిజన్‌ దాస్‌ ఈ నెల 6న ఉత్తరప్రదేశ్‌, అలహాబాద్‌లోని ఓ లాడ్జీలో దిగాడు. అయితే ఆదివారం రోజున ఆయన గది బయటకు రాకపోవడమే కాక ఆహారం కూడా తీసుకోలేదు. అనుమానం వచ్చిన వెయిటర్‌ ఈ విషయాన్ని హోటల్‌ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాడు. దాంతో వారు గది లోపలికి వెళ్లి చూడగా.. ఫ్యాన్‌కు ఉరేసుకున్న బిజన్‌ దాస్‌ వారికి కనిపించాడు. గదిలో రెండు వేల రూపాయలతో పాటు ఓ ఐదు పేజీల సూసైడ్‌ నోట్‌ కూడా లభించింది.

దానిలో తన కుమారుడి కోసం ఏం చేయలేకపోతున్నాని.. ఉద్యోగ విరమణ తర్వాత వ్యాపారం ప్రారంభించినప్పటికి కలిసి రాలేదని తెలిపాడు బిజన్‌ దాస్‌. ఇందుకు గత యూపీఏ ప్రభుత్వాన్ని, చిదంబరాన్ని తప్పు పట్టాడు. యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కామ్‌లు, తప్పుడు నిర్ణయాల వల్ల మాంద్యం పరిస్థితులు తలెత్తాయని.. ఫలితంగా రిటైర్మెంట్‌ తర్వాత తాను ప్రారంభించిన వ్యాపారాలేవి కలిసి రాలేదని బిజన్‌ దాస్‌ ఆరోపించాడు. అంతేకాక ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక మాంద్యానికి యూపీఏ ప్రభుత్వమే కారణమని ఆరోపించాడు. మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ వంటి అంశాల వల్ల తాత్కలిక ఇబ్బందులు మాత్రమే ఎదుర్కొన్నాం.. కానీ యూపీఏ ప్రభుత్వ నిర్ణయాల వల్ల ప్రస్తుత మాంద్యం పరిస్థితులు తలెత్తాయన్నాడు. తన కుమారుడు బాగా పాడతాడని.. ఓ టీవీ షోలో కూడా పాల్గొన్నాడని తెలిపాడు. తాను చనిపోవడంతో తన కుమారుడు దిక్కులేని వాడవుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తన కుమారుడు అతని కలలను సాకారం చేసుకునేందుకు మోదీ సహకరించాలని బిజన్‌ దాస్‌ విజ్ఞప్తి చేశాడు.

అంతేకాక అలహబాద్‌లోనే తన అంత్య క్రియలు పూర్తి చేయాలని అందుకు గాను రూ. 1500లను గదిలో ఉంచానని చెప్పాడు. హోటల్‌ గది అద్దె చెల్లించడం కోసం మరో 500 రూపాయలను కూడా ఉంచుతున్నట్లు పేర్కొన్నాడు. తాను మరణించాననే విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలపవద్దని కోరాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top