బంగారం రిక'వర్రీ'.!

Recovery Problems in Gold Robbery Case YSR Kadapa - Sakshi

ఏడాదిన్నర క్రితం పోరుమామిళ్ల ఎస్‌బీఐలో చోరీ

నెలన్నరలోపే బంగారం రికవరీ చేసిన పోలీసులు

ఇప్పటివరకు ఖాతాదారులకు అందని వైనం

న్యాయం చేయాలంటున్న బాధితులు

బంగారం కుదువ పెట్టి రుణం తీసుకుంటే అవసరానికి ఉపయోగపడుతుందని భావించారు... తీరా బ్యాంకులో పెట్టిన బంగారం చోరీకి గురైంది. అధికారులు రికవరీ చేసి ఏడాదవుతున్నా... తమకు ఇంకా అందకపోవడంపై ఖాతాదారులు మండిపడుతున్నారు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

వైఎస్‌ఆర్‌ జిల్లా, బద్వేలు :  పోరుమామిళ్ల స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో గతేడాది మార్చి 29న  భారీగా బంగారు నగలు, నగదు మాయమైన విషయం బయటకు వచ్చింది. బ్యాంకులో హెడ్‌ క్యాషియర్, గోల్డ్‌ ఇన్‌ఛార్జిగా పని చేస్తున్న గురుమోహన్‌రెడ్డి దీనికి బాధ్యుడిగా గుర్తించారు. దీనిపై ఉన్నతాధికారులు పరిశీలన జరిపి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగదుతో పాటు బంగారం చోరీకి గురైనట్లు తేల్చారు. ఈ బంగారమంతా బ్యాంకులో వ్యవసాయ అవసరాల కోసం పెట్టిన ఖాతాదారులకు చెందినది. పోలీసులు దర్యాప్తు చేపట్టి నెలన్నర వ్యవధిలోనే నిందితుడిని అరెస్టు చేశారు. ముత్తూట్, బజాజ్‌ ఫైనాన్స్‌లో కుదువ పెట్టిన బంగారంతో పాటు నిందితుడి వద్ద ఉన్న బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నారు. గతేడాది మే నెలలో పోలీసులు బంగారం రికవరీ చేసినా ఖాతాదారులకు మాత్రం అందలేదు. 

బ్యాంకుకు చేరినా...
పోలీసులు కేసు నమోదు, దర్యాప్తు అనంతరం నాలుగు నెలల కిందట బ్యాంకు గ్యారెంటీ పెట్టుకుని నగలను బ్యాంకులో అప్పగించారు. అధికారులు సైతం నగలకు సంబంధించిన ఖాతాదారులను పిలిపించి వాటిని గుర్తింపజేశారు. త్వరలోనే తమ బంగారు అందుతుందని సంతోషపడ్డారు. కానీ బంగారు మాత్రం అందలేదు. దీనిపై ఉన్నతాధికారులను అడుగుతున్నా స్పందించడం లేదని వాపోతున్నారు. ఇదే విషయమై పోరుమామిళ్ల మాజీ ఎంపీపీ చిత్తా విజయప్రతాప్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ నాగార్జునరెడ్డి బాధితుల తరుఫున పలుమార్లు బ్యాంకు అధికారులతో చర్చించినా ఫలితం మాత్రం కనిపించడం లేదు.

అధిక వడ్డీ కట్టాలంటే ఎలా..
దాదాపు 12 మందికి పైగా చెందిన మూడు కిలోల బంగారం ఖాతాదారులకు అందాల్సి ఉంది. ప్రస్తుతం తమ అవసరాలు తీరాయని రుణం జమ చేస్తామని చెబుతున్నా కట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. బ్యాంకులో జరిగిన తప్పిదంతో రుణం కట్టించుకోకపోవడంతో అధిక వడ్డీ కట్టాల్సి వస్తుందని చెబుతున్నారు. ఏదైనా శుభకార్యాలున్నా బ్యాంకు నుంచి నగలు విడిపించుకోలేక సతమతమవుతున్నాని అంటున్నారు. దీనిపై తమకు న్యాయం జరిగేలా చూడాలని వారు కోరుతున్నారు.

కోర్టు ఆదేశాలతో ఇవ్వలేకున్నాం
కోర్టు బ్యాంకుకు బంగారు, నగదు అప్పగించినా కేసు పూర్తయ్యే వరకు వాటిని అలానే ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో మేం ఖాతాదారులకు బంగారం ఇవ్వలేకున్నాం. దీనిపై న్యాయనిపుణులతో మాట్లాడుతున్నాం. బాధితులకు వడ్డీ పడకుండా రుణ బకాయి కట్టించుకుని రసీదు ఇస్తాం. రసీదులు కోర్టుకు సమర్పించి బాధితులకు న్యాయం చేయాలని కోరుతాం. సమస్య తీరగానే ఖాతాదారులకు వారి బంగారం అందజేస్తాం. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.– శ్రీనివాస్, రీజినల్‌ మేనేజరు, కడప

త్వరగా ఇవ్వాలి
అవసర నిమిత్తం బ్యాంకులో 250 గ్రాముల వరకు బంగారం తాకట్టు పెట్టి రూ.3లక్షలు లోను తీసుకున్నా. ప్రస్తుతం నగదు కడతామని చెప్పినా బ్యాంకు అధికారులు కట్టించుకోవడం లేదు. కోర్టు ఆదేశాలతో ఇప్పుడే బంగారు ఇవ్వలేమంటున్నారు. రుణం కట్టకపోతే సిబిల్‌ స్కోరు తగ్గి భవిష్యత్తులో రుణం పొందే అవకాశం ఉండదు.     – సురేష్‌బాబు, పోరుమామిళ్ల

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top