సుపారీ ఇచ్చింది సత్యమే..

Ram Prasad Murder Planned By koganti Satyam - Sakshi

పోలీసుల విచారణలో నేర అంగీకారం

రాంప్రసాద్‌ హత్యకోసం  రూ.10 లక్షలిచ్చిన సత్యం

సురేష్‌తో కలసి పథకం అమలు చేసిన శ్యామ్‌

సాక్షి, హైదరాబాద్‌: స్టీల్‌ వ్యాపారి తెల్లప్రోలు రాంప్రసాద్‌ను హత్య చేయించింది తానేనని పోలీసుల అదుపులో ఉన్న కోగంటి సత్యం అంగీకరించాడు. ఈ హత్యకు విజయవాడలోని కామాక్షి స్టీల్స్‌కు సంబంధించిన వివాదమే కారణమని తేలింది. ఈ వ్యవహారంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు జోక్యం చేసుకోవడంతో మరింత ముదిరింది. సెటిల్‌మెంట్‌ చేసుకున్న డబ్బు ఇవ్వకపోవడం, టీడీపీ నేతల మద్దతుతో కేసులు పెట్టి వేధిస్తుండటంతో కోగంటి సత్యం విసిగివేసారి పోయినట్టు సమాచారం. దీంతో తన ప్రధాన అనుచరుడు శ్యామ్‌తోనే హత్యకు పథక రచన చేసినట్లు, ఖర్చుల నిమిత్తం రూ.10 లక్షలిచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో సత్యంసహా ఐదుగురిని అదుపులోకి తీసుకున్న హైదరాబాద్‌ వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పరారీలో ఉన్న మరో ఇద్దరికోసం గాలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి..

20 శాతం వాటా విక్రయం...
విజయవాడకు చెందిన కోగంటి సత్యం కామాక్షి స్టీల్‌ ట్రేడర్స్‌ పేరుతో వ్యాపారం నిర్వహించేవాడు. కొన్నేళ్లక్రితం టీడీపీ నేత బొండా ఉమాను వర్కింగ్‌ పార్ట్‌నర్‌గా చేర్చుకున్నాడు. పెట్టుబడి లేకపోయినా సంస్థలోనే ఉండి, దాని వ్యవహారాలు పర్యవేక్షించేందుకు 20 శాతం వాటాను ఉమాకిచ్చాడు. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలని భావించిన ఉమా తన 20 శాతం వాటాను 2013లో రాంప్రసాద్‌తోపాటు ఆయన మేన బావమరిది ఊర శ్రీనివాస్‌కు విక్రయించారు. ఈ నేపథ్యంలోనే విజయవాడలోని వైశ్యా బ్యాంక్‌ నుంచి కామాక్షి స్టీల్స్‌ పేరిట భారీ మొత్తంలో రుణం తీసుకోవడం, దాని కిస్తీలు సక్రమంగా చెల్లించకపోవడం తదితర పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో 2014లో సెటిల్‌మెంట్‌ చేసుకున్న కోగంటి సత్యం, రాంప్రసాద్‌లు వ్యాపారం నుంచి వేరుపడ్డారు. ఆ సమయంలో తనవల్ల జరిగిన నష్టానికి, ఇతర అప్పులకు సంబంధించి రూ.25 కోట్లు చెల్లిస్తానంటూ రాంప్రసాద్‌ సెటిల్‌మెంట్‌ డీడ్‌ రాసిచ్చారు. 

రాంప్రసాద్‌కు బొండా మద్దతు...
బొండా ఉమా ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో సత్యం, రాంప్రసాద్‌ మధ్య స్పర్థలు మరింత ముదిరాయి. సెటిల్‌మెంట్‌ డీడ్‌ను బేఖాతరు చేసిన రాంప్రసాద్‌కు బొండా మద్దతు పెరిగింది. తమ మధ్య జరిగిన వివాదాలకు, వ్యవహారాలకు సంబంధించి సత్యం విజయవాడలోని ఏ ఠాణాకెళ్లినా కేసు నమోదయ్యేది కాదు. ఈ చర్యలతో విసిగిపోయిన సత్యం అదునుకోసం ఎదురుచూస్తూ ఉండిపోయాడు. 2017లో రాంప్రసాద్‌ కుటుంబంతో కలసి హైదరాబాద్‌కు చేరారు. ఖాజాగూడలో ఉంటూ పరిగిలో అభిరాం స్టీల్స్‌ పేరుతో సంస్థనేర్పాటు చేశారు. ఇటీవలే గచ్చిబౌలిలో కొత్త ఇల్లు నిర్మించుకుని గృహప్రవేశం చేశారు. 

2 నెలల క్రితమే...
దాదాపు 2 నెలలక్రితమే రాంప్రసాద్‌ను హత్య చేయించాలని నిర్ణయించుకున్న సత్యం ఈ పనిని తన అనుచరుడు, రాంప్రసాద్‌ పెట్టిన కేసుల్లో నిందితుడిగా ఉన్న శ్యామ్‌కు అప్పగించాడు. ఖర్చులకోసం రూ.10 లక్షలిచ్చాడు. రంగంలోకి దిగిన శ్యామ్‌ ఈ హత్యకోసం తన స్నేహితుడైన సురేష్‌తోపాటు ఆనంద్, ఛోటు, రమేష్‌లను తనతో కలుపుకున్నాడు. రాంప్రసాద్‌ ఆచూకీ కనిపెట్టాల్సిన బాధ్యతను ఆనంద్‌కప్పగించాడు. నగరానికి వచ్చిన ఆనంద్‌ తనకు భారీ మొత్తంలో స్టీలు కావాలంటూ ఫోన్‌ చేయగా.. రాంప్రసాద్‌ తన పంజగుట్ట కార్యాలయం చిరునామా చెప్పి అక్కడకు రావాలని సూచించాడు. ఈ క్రమంలో పరిగిలోని రాంప్రసాద్‌ సంస్థ, గచ్చిబౌలిలోని ఇల్లు గురించి కూడా ఆనంద్‌ తెలుసుకున్నాడు.  

హత్య.. అనంతర ప్రక్రియకు పథక రచన...
రాంప్రసాద్‌ను హత్య చేయడానికి ఛోటు, రమేష్‌తో కలసి శ్యామ్‌ రంగంలోకి దిగాడు. అందుకవసరమైన కత్తుల్ని విజయవాడలోని తన వాటర్‌ ప్లాంట్‌లోనే తయారు చేయించాడు. హత్యానంతరం పోలీసుస్టేషన్‌కెళ్లి లొంగిపోవాలని, ఏ దశలోనూ సత్యం పేరు బయటకు రానీయకూడదని, పోలీసుల్ని తప్పుదోవ పట్టించేందుకు ఊర శ్రీనివాస్‌ పేరు చెప్పాలని పథకం వేసుకున్నారు. ఈ నెల 2న విజయవాడ నుంచి కుటుంబంతోసహా తిరుపతి వెళ్లిన సత్యం అక్కడ్నుంచీ నేరుగా హైదరాబాద్‌ చేరుకున్నాడు. 5న విజయవాడ నుంచి వాహనంలో బయల్దేరిన శ్యామ్, సురేష్, ఛోటు, రమేష్‌ డ్రైవర్‌తో కలసి ఆనంద్‌ వద్దకు చేరుకుని బస చేశారు. 6వ తేదీ రాత్రి అదే వాహనంలో పంజగుట్టలోని వెంకటేశ్వరస్వామి ఆలయం వద్దకెళ్లారు. సురేష్‌ కాస్త దూరంలో ఆగిపోగా.. మిగిలిన ముగ్గురూ రాంప్రసాద్‌పై దాడి చేశారు. తమ ‘పని’ పూర్తయ్యాక పోలీసులకు లొంగిపోవాలని భావించిన శ్యామ్, ఛోటు, రమేష్‌ కంగారుపడి ఎవరికి వారుగా పారిపోయారు. వీరు వచ్చిన వాహనం తీసుకుని డ్రైవర్‌ విజయవాడ వెళ్లిపోయాడు. ఆనంద్‌ కూడా అజ్ఞాతంలోకి వెళ్లాడు.

పోలీసుల విచారణలో అసలు కథ బయటికి...

పథకం ప్రకారం ముందు సత్యం, ఆ తర్వాత శ్యామ్, ఛోటు, రమేష్‌ మీడియా ముందుకొచ్చి ఊర శ్రీనివాస్‌ పేరు బయటకు తెచ్చారు. అయితే రంగంలోకి దిగిన వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సత్యంతోపాటు శ్యామ్, రమేష్, ఛోటులను అదుపులోకి తీసుకుని విచారించడంతో కథంతా బయటికొచ్చింది. విజయవాడ వెళ్లిన ప్రత్యేక బృందం వాహనంతోపాటు డ్రైవర్‌ను పట్టుకుని తీసుకొచ్చింది. ప్రస్తుతం సత్యంను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, మిగిలిన నలుగురినీ పంజగుట్ట అధికారులు విచారిస్తున్నారు. పరారీలో ఉన్న ఆనంద్, సురేష్‌కోసం గాలిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top