చికిత్స పొందుతున్న గర్భిణి మృతి | Pregnant Woman Dies in Hospital | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతున్న గర్భిణి మృతి

Mar 1 2019 11:09 AM | Updated on Mar 1 2019 11:09 AM

Pregnant Woman Dies in Hospital - Sakshi

ఆందోళన చేస్తున్న మృతురాలి బంధువులు

చైతన్యపురి: చికిత్స పొందుతూ ఓ గర్భిణి మృతి చెందిన సంఘటన చైతన్య పురిలో ఉద్రిక్తతకు దారి తీసింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. మృతురాలి బంధువులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.మిర్యాలగూడకు చెందిన అంజయ్య, పద్మ దంపతుల కుమార్తె దివ్య(29)కు నాలుగు నెలల క్రితం కూకట్‌పల్లికి చెందిన వెంకట్‌తో వివాహం జరిగింది. ఆమె గర్భం దాల్చడంతో నగరంలోని ఫెర్నాండెజ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే అమెకు గుండె సంబంద వ్యాధి ఉన్నందున గర్బం దాల్చితే ప్రమాదని, అబార్షన్‌ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో ఆమె వాసవి కాలనీలోని తల్లిదండ్రుల ఇంట్లో ఉంటూ చైతన్యపురిలోని స్వప్న ఆసుపత్రి వైద్యులను సంప్రదించింది. దివ్యను ఆసుపత్రిలో చేర్చుకున్న వైద్యులు మూడు రోజుల క్రితం అబార్షన్‌ అయ్యేందుకు మందులు ఇచ్చి ఇంటికి పంపారు. అధిక రక్తస్రావం అవుతుండటంతో గురువారం మరోసారి ఆసుపత్రికి రాగా  పూర్తిగా అబార్షన్‌ కాలేదని, డీఎన్‌సి చేయాలని చెప్పడంతో తిరిగి ఆసుపత్రిలో చేర్పించారు. రక్తం తక్కువగా ఉందని చెప్పిన వైద్యులు రక్తం ఎక్కించకుండానే డీఎన్‌ఏ చేశారు.

ఉదయం పది గంటల ప్రాంతంలో దివ్య ఆరోగ్య పరిస్థితి విషమించటంతో ఓమ్ని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు   వైద్యులు ధృవీకరించారు. దీంతో మృతదేహాన్ని స్వప్న ఆసుపత్రి వద్దకు తీసుకువచ్చిన ఆమె బంధువులు వైద్యులను నిలదీశారు. నిర్లక్ష్యం కారణంగా దివ్య మృతి చెందిందని ఆరోపిస్తూ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న చైతన్యపురి పోలీసులు వివరాలు తెలుసుకున్నారు. మృతురాలి బంధువులతో మాట్లాడించేందుకు పోలీసులు ప్రయత్నం చేసినా డాక్టర్‌ స్వప్నకుమారి అందుకు అంగీకరించక పోవటంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. మద్యాహ్నం నుంచి రాత్రి 7.30 వరకు ఆందోళన కొనసాగింది. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్తగా పోలీసు బలగాలను   మోహరించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రాత్రి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  వైద్యంలో ఎటువంటి తప్పు జరగలేదని, తమ నిర్లక్ష్యం ఏమాత్రం లేదని ఆసుపత్రి నిర్వాహకురాలు డాక్టర్‌ స్వప్నకుమారి పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement