అత్యాచారయత్నం.. డీసీఎం నుంచి దూకి గర్భిణి దుర్మరణం | Pregnant death by jumping from DCM | Sakshi
Sakshi News home page

అత్యాచారయత్నం.. డీసీఎం నుంచి దూకి గర్భిణి దుర్మరణం

Dec 4 2017 3:54 AM | Updated on Dec 4 2017 8:44 AM

Pregnant death by jumping from DCM - Sakshi

తూప్రాన్‌: మెదక్‌ జిల్లాలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కూతురి(7)తో కలిసి డీసీఎం వ్యాన్‌లో ప్రయాణించిన ఓ గర్భిణిపై డ్రైవర్‌తో సహా మరో వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. దీంతో వారి నుంచి తప్పించుకునే క్రమంలో ఆ గర్భిణీ వాహనంలోంచి దూకి ప్రాణాలు కోల్పోయింది.

జిల్లాలోని తూప్రాన్‌ మండలం రావెల్లి గ్రామ శివారులోని 44వ జాతీయ రహదారిపై శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మండలంలోని పోతరాజుపల్లి గ్రామానికి చెందిన ఉగిడే కళావతి (32) ఎనిమిది నెలల గర్భిణి. తన కూతురు శిరీష(8)తో కలసి బట్టల వ్యాపారం కోసం మేడ్చల్‌ జిల్లా కొంపల్లికి వెళ్లి రాత్రి 10 గంటల సమయంలో డీసీఎంలో ఇంటికి బయలుదేరింది.

ఈ క్రమంలోనే డీసీఎం కరీంగూడ చౌరస్తా వద్ద ఆపకుండా అతివేగంగా వెళ్తుండటంతో వాహనాన్ని ఆపాలని ఆమె కోరింది. అయినా డ్రైవర్‌ వినిపించుకోకుండా ముందుకు వెళ్లడంతో కలవరపడిన ఆమె డీసీఎం నుంచి దూకింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. షాక్‌కు గురైన డ్రైవర్‌ ఆమె కూతురును, బట్టల మూటను రోడ్డు పక్కన వదిలేసి పరారయ్యాడు. సమీపంలోని కొందరు గమనించి కుటుంబీకులకు సమాచారమందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ పరుశురాంగౌడ్‌ తెలిపారు.

స్టేజీ వెళ్లిపోతోందన్న తొందరలో..
దిగే స్టేజీ వెళ్లిపోతోందన్న తొందరలో కళావతి దూకి మరణించినట్లు ఆమె భర్త ఫిర్యాదులో పేర్కొనగా.. ఆమె తల్లిదండ్రులు మాత్రం డీసీఎంలోని వ్యక్తులు అత్యాచారయత్నానికి పాల్పడటంతో కళావతి దూకి చనిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement