తల్లీబిడ్డల సజీవ దహనం: అతడే హంతకుడు

Prakasam Police Reveal Murder Mystery Of Mother And Child Ablaze - Sakshi

సాక్షి, ప్రకాశం: జిల్లాలోని మద్దిపాడు మండలం పేర్లమెట్ట- లింగంగుట్ల వద్ద తల్లీబిడ్డ హత్య కేసును ప్రకాశం పోలీసులు ఛేదించారు. భార్యపై అనుమానంతో వివాహిత భర్తే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు గుర్తించారు. వివరాలు... ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం పేర్లమెట్ట శివారులో బురదతో ఉన్న డొంక దారిలో ఈ నెల మూడో తేదీ సాయంత్రం ఐదు గంటల సమయంలో ఓ మహిళ, ఏడాది వయసున్న బిడ్డ మంటల్లో తగులబడుతున్న దృశ్యాన్ని సమీపంలో ఉన్న కొందరు రైతులు చూశారు. ఆ సమాచారాన్ని గ్రామస్తులకు అందజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అయితే అప్పటికే ఆ రెండు మృతదేహాలూ దాదాపు కాలిపోయాయి.

ఈ క్రమంలో ఘటన జరిగిన సమయంలో అటుగా వెళ్లిన కొందరిని పోలీసులు విచారించారు. అయ్యప్ప దీక్షలో ఉన్న ఇద్దరు ఇచ్చిన సమాచారంతో దర్యాప్తును వేగవంతం చేశారు. తాము ఆ బురద దారిలో వెళుతున్నప్పుడు ఓ యువకుడు, ఓ యువతి, ఓ చంటిబిడ్డతో మోటారు సైకిల్‌పై వస్తూ ఆగి కోపంతో వాదించుకుంటున్నారని ఆ స్వాములు పోలీసులకు తెలిపారు. ‘‘ఈ బురద దారిలో గొడవేమిటి? మీరెవరు?’’ అని తాము అడగగా.. తాము భార్యాభర్తలమని, అటుగా పనుండి వెళ్తున్నామని వారు చెప్పారని స్వాములు వివరించారు.

ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన పోలీసులు.. యువతి భర్తే తల్లీబిడ్డలను సజీవ దహనం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుడిని కోటేశ్వరరావుగా గుర్తించారు. అతడు స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడని.. అతడిది అద్దంకి మండలం దామావారిపాలెం అని పేర్కొన్నారు. కోటేశ్వరరావు చేతులకు కాలిన గాయాల ఆధారంగా దర్యాప్తు చేయడంతో నిజాలు వెలుగులోకి వచ్చాయి. భార్యపై అనుమానంతో అతడు భార్యాబిడ్డలను చంపేసినట్లు తమ విచారణలో వెల్లడైందని పోలీసులు వెల్లడించారు.

 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top