గిరి కింద నా సామీ!

Police Seized Canj In West Godavari - Sakshi

గంజాయి రవాణాకు అన్నవరం అడ్డా ?

ఆటోలో తరలిస్తున్న 40 కేజీల గంజాయి స్వాధీనం

సాక్షి, అన్నవరం (తూర్పుగోదావరి) : ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం గంజాయి రవాణా, విక్రయాలకు అడ్డాగా మారిందా? నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఈ క్షేత్రాన్ని సురక్షిత స్థావరంగా గంజాయి స్మగ్లర్లు భావిస్తున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వచ్చేలా వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు ఇక్కడ గంజాయి పట్టుబడింది. గత ఆదివారం స్థానిక సినిమాహాలు సెంటర్‌లోని సత్యదేవ లాడ్జిపై దాడి చేసిన పోలీసులు 15 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వనపర్లి భరత్‌కుమార్‌ను అరెస్ట్‌ చేశారు. ఆ విషయం ఇంకా  మరచిపోకముందే శుక్రవారం ఉదయం అన్నవరం శివార్లలోని మండపం సెంటర్‌ వద్ద ఆటోలో తరలిస్తున్న 40 కేజీల గంజాయిని అన్నవరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ గంజాయిను తరలిస్తున్న విశాఖ జిల్లాకు చెందిన ఆరుగురిని అరెస్ట్‌ చేశారు.

రూ.లక్ష విలువైన 40 కేజీల గంజాయి స్వాధీనం
ఆటోలో గంజాయి తరలిస్తున్నారని అందిన సమాచారం మేరకు అన్నవరం జాతీయ రహదారిపై మండపం సెంటర్‌ వద్ద ఓ ఆటోను ఆపి తనిఖీ చేయగా అందులో 22 ప్యాకెట్లలో తరలిస్తున్న 40 కేజీల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్టు ప్రత్తిపాడు సీఐ ఏ సన్యాసిరావు శుక్రవారం విలేకర్లకు తెలిపారు. ఈ గంజాయి విలువ రూ.లక్ష ఉంటుందని తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆ ఆటోలో గంజాయిని తరలిస్తున్న విశాఖ జిల్లాకు చెందిన ఆరుగురిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు.

చింతపల్లి మండలం కోడగుమ్మాల గ్రామానికి  చెందిన తెంబెల్లి ప్రసాద్, అదే గ్రామానికి చెందిన పాంగి యోహన్‌ కుమార్, అరకులోయ మండలం గొందివలస గ్రామానికి చెందిన పొంగి బంగార్రాజు, కొయ్యూరు మండలం మరిపాలెం గ్రామానికి చెందిన పోలిన నరసింహమూర్తి,  అదే మండలంలోని కొండిసంత మూల పేట గ్రామానికి చెందిన కోలా అప్పారావు, మాకవారి పాలెం గ్రామానికి చెందిన పళ్యా నాగరాజు ప్రయాణికుల్లా ఆటోలో ఉండి గంజాయి తరలిస్తున్నట్టు విచారణలో తేలిందని తెలిపారు. వీరు గంజాయిని చెన్నైకు తరలిస్తున్నట్టు తెలిపారని సీఐ వివరించారు.

పట్టుబడిన వారందరూ గంజాయి రవాణా చేసేవారేనని తేలిందని తెలిపారు. వీరికి అసలు వ్యాపారులు తెలియదని, అప్పగించిన పని పూర్తి చేయడం వరకే వీరి భాధ్యత అని తెలిపారు. వీరిపై మాదకద్రవ్యాల తరలింపు చట్టం ప్రకారం కేసు నమోదు చేసి ప్రత్తిపాడు కోర్టుకు తరలించినట్టు తెలిపారు. చాలామంది అమాయకులు కూలి డబ్బులకు ఆశపడి గంజాయి రవాణా చేస్తున్నారని తెలిపారు. 

గుట్కా, ఖైనీ ప్యాకెట్టు అమ్మినా కేసు తప్పదు
గుట్కా, ఖైనీ ప్యాకెట్లు అమ్మినా, కలిగి ఉన్నా కేసు తప్పదని సీఐ ఏ సన్యాసిరావు తెలిపారు. ఈ నెల మూడో తేదీన జాతీయరహదారిపైన ఒక పాన్‌షాపులో విక్రయిస్తున్న 2,200 గుట్కా, విమల్, రాజీ ఖైనీ, ఏ1, ఎన్‌సీ, చైనా ఖైనీ పాకెట్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఆ షాపు యజమాని మలిరెడ్డి నాగేశ్వరరావు పై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. సమావేశంలో   అన్నవరం ఎస్సై మురళీమోహన్, ఇతర పోలీసులు పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top