‘నకిలీ’ వెనుక అసలు ఎవరు?

Police Release Fake Police Images Krishna - Sakshi

ఆరా తీస్తున్న సీసీఎస్‌ పోలీసులు

ఊహాచిత్రం విడుదల  

నకిలీ పోలీసుల ముసుగులో ఉన్న అసలు వ్యక్తుల కోసం సీసీఎస్‌ పోలీసులు వేట ప్రారంభించారు. పెదపులిపాక ఘటన నేపథ్యంలో బాధితురాలు చెప్పిన ఆనవాళ్ల మేరకు పోలీసులు నిందితుల ఊహాచిత్రాలు విడుదల చేశారు.

విజయవాడ : నగరంలో మళ్లీ నకిలీ పోలీసుల హడావిడి మొదలైంది. నకిలీ పోలీసుల ముసుగులో ఉన్న అసలు వ్యక్తుల కోసం సీసీఎస్‌ పోలీసులు వేట ప్రారంభించారు. మూడేళ్ల క్రితం నకిలీ పోలీసులు రకరకాల దొంగతనాలు, అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు. కొద్ది రోజుల క్రితం నగరంలో నకిలీ పోలీసులు భవానీపురం ఏరియాలో తాము ఎస్‌ఐలమని బెదిరించి పట్టుపడ్డారు. వీరిద్దరూ స్థానికంగా ఉండే యువకులు. తాజాగా పెనమలూరు పోలీస్‌ స్టేషన్‌ ఏరియాలో పెదపులిపాకలోని ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న ముసునూరు సుజాతమ్మ (70) అనే వృద్ధురాలిని పోలీసులమని బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం ఇద్దరు అగంతకులు ఖాకీ యూనిఫాంతో ఆమె ఇంట్లో ప్రవేశించి సేవ పేరుతో ఆమెను పొగుడుతూ మాటల్లో పెట్టి దోపిడీకి పాల్పడ్డారు. ఈ క్రమంలో బాధితురాలు ఇచ్చిన ఆనవాళ్ల ప్రకారం ఇద్దరి నిందితులలో ఒకరి ఊహాచిత్రాన్ని పోలీసులు విడుదల చేశారు. ఈ ఊహాచిత్రంతో పోలీసులు పాత రికార్డులు తిరగేస్తున్నారు.

ఇద్దరు పాత నేరస్తులు జైలు నుంచి విడుదలై ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నారని  పోలీసులు భావిస్తున్నారు. గుంటూరు, విజయవాడ ప్రాంతాలకు చెందిన కొందరు పాత నేరస్తులు ఈ తరహా నేరాలకు పాల్పడుతుంటారని వారు అనుమానిస్తున్నారు. కాగా ఊహాచిత్రంతో పోలి ఉన్న వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే, వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. పోలీస్‌ కంట్రోల్‌ రూం డయల్‌ – 100, పెనమలూరు ఇన్‌స్పెక్టర్‌ 9490619468, సెంట్రల్‌ జోన్‌ ఏసీపీ 9440627035కు సమాచారం ఇవ్వాలని పోలీసు అధికారులు కోరారు. కాగా గుర్తు తెలియని వ్యక్తులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నగర పోలీసు కమిషనర్‌ డి. గౌతం సవాంగ్‌ హెచ్చరించారు. తమ ప్రాంతాల్లో అనుమానితులు, అపరిచితుల సంచారం గమనించిన వెంటనే పోలీస్‌ కంట్రోల్‌ రూంకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top