కిడ్నాప్‌ మిస్టరీ; వివరాలు వెల్లడించిన సీపీ

Police Commissioner Explains Pharmacy Student Kidnap Mystery In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సంచలనం సృష్టించిన ఫార్మాసీ విద్యార్థిని సోనీ కిడ్నాప్‌ కేసును పోలీసులు చేధించారు. కిడ్నాపర్‌ రవిశేఖర్‌ను పోలీసులు అద్దంకిలో అరెస్ట్‌ చేసి మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. కిడ్నాప్‌కు సంబంధించి సోని స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశామని, ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. కిడ్నాపర్‌ రవిశేఖర్‌ తన పట్ల దారుణంగా ప్రవర్తించాడని సోని తెలిపిందన్నారు.

‘గత ఏడు రోజులుగా కారులోనే ఉంచిన కిడ్నాపర్.. నిన్న చిలకలూరిపేటలో సోనీని వదిలేశాడు. బస్‌ కండక్టర్‌ సాయంతో అద్దంకి వచ్చి అక్కడి నుంచి ఈ రోజు హైదరాబాద్‌ చేరుకుంది. రెండు రోజుల పాటు కిడ్నాప్ అయిన విషయం తెలుసుకోలేకపోయిన సోనీ.. తన నాన్న, తమ్ముడు గురించి రవిశంకర్‌ను ప్రశ్నిస్తే నీ ఉద్యోగం పనిపై వెళ్లారని నమ్మబలికాడు. మొదటగా సోనీని కడపకి తీసుకెళ్లిన అనంతరం తిరుపతి, అద్దంకి, చిలకలూరిపేట తదితర ప్రాంతాల్లో తిప్పాడు. ఉద్యోగం పేరుతో సోనీని మభ్యపెట్టాలని చూసిన రవిశంకర్.. ఆమె మాట వినకపోవడంతో చంపేస్తానని బెదిరించాడు. రోజూ పెట్రోల్‌ బంక్‌, నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశాలను ఎంచుకొని చంపేస్తానని బెదిరించి కారులో ఉంచాడు. రోజుకు ఒక్కసారే భోజనం పెట్టేవాడు. ఏదైనా కావాలంటే బయట ఉన్నవారినే కారు దగ్గరికి పిలిచేవాడు. అరిస్తే చంపేస్తానని బెదిరించాడని’ ఆమె స్టేట్‌మెంట్‌లో వెల్లడించిన విషయాన్ని పోలీస్‌ కమిషనర్‌ మీడియాకు తెలిపారు.

వైద్య పరీక్షలు పూర్తి
కిడ్నాప్ గురైన సోనీకి పేట్ల బుర్జ్‌ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. దాదాపు 3 గంటల పాటు ఆమెకు డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారు. వైద్య పరీక్షల అనంతరం హాస్పిటల్ నుంచి మీడియా కంట కనపడుకుండా ముసుగు వేసి ఆమెను అక్కడి నుంచి రాచకొండ పోలీసులు రహస్యంగా తీసుకెళ్లారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top