
అదృశ్యమైన పెంపుడు కుక్క మోజీ (ఫైల్)
బంజారాహిల్స్: తాను అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుక్కను దత్తత తీసుకున్న వ్యక్తులు నిర్లక్ష్యంతో దాన్ని పోగొట్టారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ యువకుడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. తిరుపతి పట్టణానికి చెందిన జె.సి.తరుణ్‌తేజ శ్రీకృష్ణానగర్‌లో అద్దెకుంటూ ఆఫీసర్స్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నాడు. తనకు రెండు పెంపుడు కుక్కలు ఉండగా అందులో ‘మోజీ’ అనే దానిని గత నెల19న బోరబండకు చెందిన హరి, ఆకాష్ అనే వ్యక్తులకు ఇచ్చాడు. పెంపుడు కుక్కపై మమకారాన్ని చంపుకోలేక నాలుగు రోజుల తర్వాత దానిని చూసి వద్దామని హరి, ఆకాష్‌లకు ఫోన్ చేయగా, కుక్క తన స్నేహితుడి వద్ద ఉందని తీసుకొచ్చిన తర్వాత ఫోన్ చేస్తామని చెప్పారు.
గత నెల 24న మరోసారి ఫోన్‌చేసి ‘మోజీ’ని చూడాలని ఉందని కోరగా, దానికి ఆరోగ్యం బాగా లేనందున ఆపరేషన్ చేయించామని ఇప్పుడు చూడటానికి కుదరదని చెప్పారు. గత నెల 31న మరోసారి ఫోన్ చేసిన తరుణ్‌తేజ తన కుక్కను చూపించకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించాడు. రెండు రోజుల క్రితం బోరబండలోని వారి ఇంటికి వెళ్లి చూడగా కుక్క కనిపించకపోవడంతో వారిని ప్రశ్నించాడు. దీంతో వారు అందరినీ కరుస్తుండటంతో కావూరిహిల్స్ ప్రాంతంలో వదిలేసినట్లు తెలిపారు. వారిపై చర్యలు తీసుకోవాలంటూ మంగళవారం బాధితుడు తరుణ్‌తేజ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు అదృశ్యమైన కుక్క కోసం గాలింపు చేపట్టారు.