మోసం... ఆపై ఆత్మహత్యాయత్నం.!

Person Cheated Womens By Jobs And Later Try To Commit Suicide In Bhimili - Sakshi

సాక్షి, భీమిలి(విశాఖపట్నం) : ఏదోలా ఉద్యోగం సంపాదించాలన్న నిరుద్యోగుల బలహీనతను అసరాగా చేసుకొని కొంతమంది  తెలివిగా మోసగించిన సంఘటనలు కోకొల్లలు. నమ్మిన వారిని మోసగించడమే కాకుండా తిరిగి వారినే బ్లాక్‌మెయిల్‌ చేయబోయి కథ అడ్డం తిరగడంతో బోర్లాపడిన ఘనుడి ఉదంతమింది. వివరాల్లోకి వెళ్తే... విజయనగరం జిల్లాకు చెందిన మట్టా కామరాజు (35) ఇంటర్‌ వరకూ చదువుకున్నాడు.

పీఎం పాలెంలోని విజేత సూపర్‌ మార్కెట్‌ సమీపంలోని ది రెసిడెన్సీ నాలుగో అంతస్తులోని ప్లాటులో 11 నెలలుగా కుటుంబంతో నివసిస్తున్నాడు. నిరుద్యోగులను బుట్టలో వేయడానికి ఈ ఏడాది జనవరిలో శ్రీ సంపత్‌ వినాయక టెక్నాలజీ సెంటర్‌ పేరుతో జగదాంబ కూడలిలో ఓ సంస్థ ప్రారంభించాడ.

తమ సంస్థ జీఎస్‌టీ లావాదేవీల వ్యవహారాలు చూస్తుందని నమ్మించి పలువురు యువతలను ఉద్యోగులుగా చేర్చుకున్నాడు. అనంతరం వారికి జీఎస్టీ లావాదేవీలకు సంబంధించి కొద్దిరోజుల పాటు శిక్షణ కూడా ఇప్పించాడు. ఈ క్రమంలోనే జీఎస్‌టీ కార్యాలయంతో తనకు సంబంధాలు ఉన్నట్టుగా నమ్మించడానికి యువతులను పలుమార్లు అక్కడకు తీసుకెళ్లాడు. 

ఆరు నెలలుగా పైసా చెల్లించలేదు 
సంస్థలో చేరిన ఉద్యోగులకు రూ.15 వేలు నుంచి రూ.35 వేలు ఇస్తానని ప్రకటించాడు. అయితే ఆరు నెలలు కావస్తున్నా పనిచేస్తున్న సిబ్బందికి పైసా వేతనమూ ఇవ్వలేదు. ఈ విషయమై నిలదీయడానికి మంగళవారం మధ్యాహ్నం కామరాజు నివసిస్తున్న పీఎం పాలెంలోని నివాసానికి సిబ్బంది అంతా మూకుమ్మడిగా వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న కామరాజు తాను నివసిస్తున్న నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నటించాడు.

దీంతో అపార్టుమెంటువాసులు, స్థానికులు 100 నంబరుకు ఫోన్‌ చేయడంతో పీఎం పాలెం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. భవనంపై నుంచి వేలాడుతూ కనిపిస్తున్న కామరాజును చాకచక్యంగా తాళ్లతో కట్టి కిందకు దించి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఉద్యోగంలో చేరి మోసపోయిన వారిలో ఎక్కువ మంది ఇంజినీరింగ్, ఎంబీఏ పట్టభద్రలు కావడం విశేషం.

11 నెలలుగా అద్దె ఎగనామం 
మరోవైపు తాను నివాసముంటున్న ప్లాటు యజమాని గౌతం హర్షకు 11 నెలలుగా అద్దె చెల్లించకుండా కామరాజు ఇబ్బంది పెడుతున్నాడు. గౌతం దువ్వాడలో కుటుంబంతో నివాసముంటున్నారు. అతను అద్దె అడిగినప్పుడల్లా రేపూ మాపూ అంటూ కామరాజు రోజులు గడుపుతున్నాడు. ఈ క్రమంలో అపార్టుమెంటు పైనుంచి దూకేందుకు యత్నించాడన్న విషయం తెలుసుకున్న గౌతం హర్ష తన సోదరి భావన సాయంతో కామరాజుపై పోలీసులకు ఫిర్యాదు చేయించారు. మరోవైపు ఆరు నెలలుగా జీతాలు ఇవ్వలేదని ఆరోపిస్తూ నిరుద్యోగ యువతులు పోలీసులకు తమ గోడు వినిపించారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేశామని పీఎం పాలెం సీఐ పి.సూర్యనారాయణ తెలిపారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top