జయరామ్‌తోఉన్నదెవరు?

NRI Jayram Murder Mystery Still Pending In Krishna - Sakshi

జయరామ్‌ మృతిలో కీలక అంశం అదే

ఆ కోణంలోనే పోలీసుల దర్యాప్తు

సమీప బంధువులపైనే అనుమానాలు   

సాక్షి, అమరావతి బ్యూరో :  వ్యాపారవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరామ్‌ మృతిపై అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. డ్రైవర్, గన్‌మెన్‌ లేకుండా ఏ రోజూ ఒంటరిగా కారులో బయటకు వెళ్లని జయరామ్‌ బుధవారం తానే డ్రైవింగ్‌ చేసుకుంటూ కారులో ఎందుకు వెళ్లాల్సి వచ్చింది?.. జయరామ్‌ మృతి చెందడానికి ముందు ఆయనతో పాటు కారులో ఉన్నది ఎవరన్నది ఇప్పుడు కీలక అంశమైంది. హైదరబాద్‌లో ఉన్న ఆయన సమీప బంధువులపైనా అనుమానాలు నెలకొన్నాయి. పోలీసులు ఆ కోణంలోనే దర్యాప్తు చేపట్టారు.

జయరామ్‌ భార్య, పిల్లలు ఆమెరికాలోని ఫ్లోరిడాలో నివసిస్తున్నారు. కొన్నేళ్లుగా హైదరాబాద్‌లోనే ఉంటున్న జయరామ్‌ ఫ్యాక్టరీ, బ్యాంకు కార్యకలాపాలు చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన బుధవారం ఇంటి నుంచి ఒంటరిగా తానే స్వయంగా కారును నడుపుకుంటూ బయటకు రావడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఎవ్వరికీ ఫోన్‌లో అందుబాటులో లేకుండాపోయారు. ఆ తర్వాత గురువారం సాయంత్రం మాత్రం తాను విజయవాడ వస్తున్నానని బస చేసేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా వారికి సూచిస్తూ బెజవాడలో ఉన్న తన సిబ్బందికి ఫోన్‌ ద్వారా మేసేజ్‌ పంపించారు. తర్వాత ఆయన భార్యతోనూ మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే ఆమెతో ఏం మాట్లాడారు అన్న దానిపై పూర్తి వివరాలు తెలియరాలేదు. విజయవాడలోని తన బస ఏర్పాట్ల గురించి పంపిన మేసేజ్‌ ఆయన ఫోన్‌ నుంచి వెళ్లిన లాస్ట్‌ మేసేజ్‌గా పోలీసులు గుర్తించారు. తరువాత కొద్ది గంటల్లోనే ఆయన అనుమానాస్పదంగా మృత్యువాత పడ్డారు.

కారులో ఉన్నదెవరు?
నందిగామ సమీపంలోని కీసర టోల్‌గేట్, ఐతవరం సమీపంలో ఓ కార్లో జయరామ్‌ మృతదేహం లభ్యమైంది. శుక్రవారం తెల్లవారుజామున కారులోని మృతదేహాన్ని చూసిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఇతర డాక్యుమెంట్లను పరిశీలించిన పోలీసులు కారులో ఉన్న మృతదేహం చిగురుపాటి జయరాందేనని గుర్తించారు. కార్లో వెనక సీట్లో రక్తపుమడుగులో ఉన్న జయరామ్‌ను పరిశీలించిన పోలీసులు.. ఆయన తలపై బలమైన గాయాలున్నాయేమోనని చూడగా.. తలపై ఎలాంటి గాయాలు లేనట్లు తేలింది. రోడ్డు ప్రమాదం జరిగిన దాఖలాలు కూడా అక్కడ కనిపించడం లేదు. దీంతో కేసును నమోదు చేసుకున్న పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో టోల్‌గేట్ల వద్ద సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా కారులో తెల్లదుస్తులు ధరించిన ఓ వ్యక్తి డ్రైవింగ్‌ చేస్తూ కనిపించడాన్ని పోలీసులు గుర్తించారు. ఆ కారులో ఉన్న అజ్ఞాత వ్యక్తే ఈ హత్యకు పాల్పడ్డాడా? లేదా అతనికి ఇంకెవరైనా సాయం చేశారా? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇంటి వద్ద ఉన్న డ్రైవర్‌ను కాదని.. తానే స్వయంగా కారును డ్రైవింగ్‌ చేసుకుంటూ బయటకు వచ్చిన జయరామ్‌ ఆ తర్వాత ఎక్కడెక్కడకు వెళ్లారు? ఎవరెవరిని కలిశారు? అన్న విషయాలు బయటకొస్తేనే అసలు జయరామ్‌ హత్యకు కారణాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నారు.

మద్యంలో సైనెడ్‌ కలిపారా? దిండుతో ఊపిరాడకుండా చంపేశారా?
జయరామ్‌ తలపై ఎలాంటి గాయాలు లేవని నిర్ధారించుకున్న పోలీసులు ఇది కచ్చితంగా హత్యనేనని తేల్చినట్లు తెలిసింది. ఎందుకంటే జయరామ్‌ చెవి, ముక్కు నుంచి రక్తం కారినట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో జయరామ్‌ను ఏదైనా దిండులాంటి వస్తువుతో ఊపిరాడకుండా చేసి చంపేయడంతోనే అతని ముక్కు, చెవి వెంట రక్తం కారి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.లేదా కారులో ఉన్న మద్యం సీసాలను బట్టి అందులో సైనెడ్‌ కలిపి జయరామ్‌కు తాగించడం వల్ల కూడా అలా జరిగే అవకాశాలు లేకపోలేదని వారు అంటున్నారు.

సమీప బంధువులపైనాసందేహాలు..  
చిగురుపాటి హత్యకు హైదరాబాద్‌లోనే కుట్ర జరిగిందనే కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు. ఈ హత్య కుట్రలో ఆయన బంధువుల పాత్ర ఏమైనా ఉందా? అన్న దానిపైనా ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు జయరామ్‌ సమీప బంధువు, మేనకోడలు శిఖా చౌదరిని  విచారణ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top