రోజంతా  హైడ్రామా

Nizamabad Mayor Arrested In Sexual Harassment Case - Sakshi

నిజామాబాద్‌అర్బన్‌: లైంగిక వేధింపుల కేసులో రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ తనయుడు, నిజామాబాద్‌ మాజీ మేయర్‌ సంజయ్‌ విచారణకు హాజరు కావడం, ఆయనను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించేందుకు పోలీసులు తీవ్రంగా యత్నించడంతో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు హైడ్రామా కొనసాగింది. చివరకు ఫ్యామిలీ కోర్టు ఈ నెల 22 వరకు రిమాండ్‌ విధించడంతో సంజయ్‌ను జిల్లా జైలుకు తరలించారు. నర్సింగ్‌ విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్‌పై పోలీసులు నిర్భయ చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి సంజయ్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.

తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని సంజయ్‌ హైకోర్టును ఆశ్రయించగా, సీఆర్పీసీ 41–ఏ ప్రకారం నోటీసులు జారీ చేసి, విచారణ చేపట్టాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో పోలీసులు నోటీసులు జారీ చేయగా, సంజయ్‌ ఆదివారం ఉదయం 11 గంటలకు ఏసీపీ సుదర్శన్‌ కార్యాలయానికి చేరుకున్నారు.  
మధ్యాహ్నం 2 గంటల వరకు సంజయ్‌ని విచారించిన పోలీసులు.. అక్కడి నుంచి ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన అనంతరం గంగాస్థాన్‌లో నివాసముండే మొదటి అదనపు జడ్జి మేరి సార దానమ్మ ఎదుట ప్రవేశపెట్టారు. ఏసీపీ సుదర్శన్‌ రిమాండ్‌ రిపోర్టు సమర్పించగా, జడ్జి పలు సందేహాలను లేవనెత్తారు. రిమాండ్‌కు తరలించేందుకు నమో దు చేసిన అభియోగాలు సక్రమంగా లేకపోవడం పై ప్రశ్నించారు.

హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన రెండ్రోజులకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంపై జడ్జి ప్రశ్నించినట్లు సంజయ్‌ తరఫు న్యాయవాదులు తెలిపారు. దీంతో ఏసీపీ సుదర్శన్‌ సీపీ కార్తికేయను కలిసి మరోసారి రిమాండ్‌ రిపోర్టును సిద్ధం చేసుకొని సాయంత్రం 6 గంటల జడ్జికి సమర్పించారు. దీనిని పరిశీలించిన న్యాయమూర్తి.. సంజయ్‌ని అదుపులో ఉంచుకొని, సోమ వారం కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించారు. దీంతో సంతృప్తి చెందని పోలీసులు.. ప్రగతినగర్‌లో నివాసముండే అదనపు జడ్జి సూర్యచంద్రకళ ఎదుట ప్రవేశపెట్టారు. రిమాండ్‌ రిపోర్టును పరిశీలించిన న్యాయమూర్తి.. సంజయ్‌ని రిమాండ్‌ చేసేందుకు అంగీకరించలేదని అతడి తరఫు న్యాయవాదులు తెలిపారు.

14 రోజుల రిమాండ్‌  
ఎలాగైనా సంజయ్‌ను రిమాండ్‌కు తరలించాలనుకున్న పోలీసులు చివరకు వినాయక్‌నగర్‌లో ఉండే ఫ్యామిలీ కోర్టు జడ్జి సుదర్శన్‌ ఎదుట సంజయ్‌ని హాజరు పరిచారు. రిమాండ్‌ రిపోర్టు పరిశీలించిన న్యా యమూర్తి.. రాత్రి 11 గంటల వరకు విచారణ చేపట్టారు. చివరకుఈ నెల 22 వరకు రిమాండ్‌ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసులు అర్ధరాత్రి వేళ సంజయ్‌ను జిల్లా జైలుకు తరలించారు.

ఉదయం 11 నుంచి అర్ధరాత్రి దాకా..
సంజయ్‌ విచారణ, రిమాండ్‌ యత్నాల నేపథ్యం లో ఆదివారం రోజంతా హైడ్రామా నెలకొంది. పోలీసుల అదుపులో ఉన్న సంజయ్‌ జైలుకు వెళ్తారా.. లేక బెయిల్‌పై బయటకు వస్తారా? అన్న దానిపై జోరుగా చర్చ జరిగింది. సంజయ్‌ని అరెస్టు చేసి, జైలుకు పంపాలని పోలీసులు తీవ్రంగా యత్నించారు. అయితే,సీఆర్పీసీ 41–ఏ ప్రకారం విచారణ చేపట్టాలన్న హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వారి ప్రయత్నాలు తొలుత ఫలించలేదు. లైంగిక వేధింపుల కేసుకు సంబం దించి సీఆర్పీసీ 41 ఏ ప్రకారమే విచారణ జరపా లని హైకోర్టు స్పష్టం చేయడంతో పోలీసులు అతడ్ని రిమాండ్‌కు తరలించే అవకాశం లేదని అతని తరఫు న్యాయవాదులు తెలిపారు.

మరోవైపు, లైంగిక వేధింపుల కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం సరికాదని వారు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపైనే న్యాయమూర్తులు పోలీసుల ను ప్రధానంగా ప్రశ్నించినట్లు సంజయ్‌ తరఫు న్యాయవాదులు తెలిపారు. హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేసిన తరువాత అట్రాసిటీ కేసు నమోదు చేయడంపై న్యాయవాదులు గట్టిగానే వాదనలు వినిపించారు. పోలీసుల విచారణ తీరుపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేస్తామని వారు చెప్పారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top