రారా.. అక్కడకు రారా | New plans of OLX criminals | Sakshi
Sakshi News home page

రారా.. అక్కడకు రారా

Jan 21 2019 1:51 AM | Updated on Jan 21 2019 4:57 AM

New plans of OLX criminals - Sakshi

ఓఎల్‌ఎక్స్‌తోపాటు ఇతర ఈ–కామర్స్‌ సైట్స్‌లో తక్కువ ధరకు వాహనాలు అమ్ముతామంటూ పోస్టులు పెట్టి అందినకాడికి దండుకునే మోసగాళ్ల పంథా మారుతోంది. ఇప్పటివరకు ఆన్‌లైన్‌లో ‘అడ్వాన్స్‌’ తీసుకుని మోసం చేసేవారు. తాజాగా తమ మాటల వలలో పడినవారిని రాజస్థాన్‌తోపాటు హర్యానాలోని కొన్ని ప్రాంతాలకు రప్పించి కిడ్నాప్‌ చేసి దోచేస్తున్నారు. ఈ విధంగా మోసపోయిన ఓ వ్యక్తి పోలీసుల్ని సంప్రదించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.     
– సాక్షి, హైదరాబాద్‌

ఇక్కడివరకు రొటీన్‌ పంథానే..
ఓఎల్‌ఎక్స్‌తోపాటు మరికొన్ని సైట్స్‌లోనూ ఖాతాలు తెరిచి పోస్టింగ్స్‌ పెడుతున్న సైబర్‌ నేరగాళ్లు ప్రధానంగా రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కు చెందిన వారే. ప్రజల్ని తేలిగ్గా మోసం చేయడానికి దేశ వ్యాప్తంగా విధులు నిర్వర్తించే, ఎప్పుడు–ఎక్కడికైనా బదిలీ అయ్యే ఆర్మీ ఉద్యోగుల పేర్లు వాడుకుంటున్నారు. వివిధ మార్గాల్లో సేకరించినవారి ఫొటోలతోనో, తామే ఆ వేషాలు వేసుకునో పోస్టింగ్స్‌ చేస్తున్నారు. వాటిలో బుల్లెట్‌తోపాటు వివిధ రకాలైన కార్లకు సంబంధించిన ఆకర్షణీయమైన ఫొటోలను, వాటికి అత్యంత తక్కువ ధరలను పొందుపరుస్తున్నారు. తమకు వేరే ప్రాంతానికి బదిలీ అయినందుకో, రిటైర్‌ అయిన నేపథ్యంలోనో ఆయా వాహనాలను అమ్మి వెళ్లిపోవడానికి నిర్ణయించుకున్నామంటూ ఆ పోస్ట్‌లో పొందుపరుస్తున్నారు. ఇక్కడిదాకా గతంలో ఎలా వ్యవహరించారో అలానే చేస్తున్నారు.

పరిచయం లేని వారితో లావాదేవీలు వద్దు
కేవలం ఓఎల్‌ఎక్స్‌ యాడ్స్‌ విషయంలోనే కాదు ఏ విషయంలోనూ పరిచయం లేని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు వద్దు. వాహనాలు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు తక్కువ ధరకు విక్రయిస్తామంటూ వివిధ ఈ–కామర్స్‌ సైట్స్‌లో ఉన్న ప్రకటనలు గుడ్డిగా నమ్మకూడదు. ప్రత్యక్షంగా వస్తువుల్ని, వ్యక్తుల్ని చూడకుండా అడ్వాన్స్‌లు చెల్లించవద్దు. ఎవరైనా కొత్త వ్యక్తులు వ్యాపారం తదితరాల పేర్లు చెప్పి నగదుతో తమ ప్రాంతాలకు రమ్మంటే వెళ్లకపోవడం ఉత్తమం. అనేక సందర్భాల్లో ఆయా పోలీసు విభాగాల నుంచి పూర్తి సహకారం లభించకపోవచ్చు. అన్ని వివరాలు పక్కాగా సరిచూసుకున్న తర్వాతే ఆర్థిక లావాదేవీలు చేయాలి. – సైబర్‌ క్రైమ్‌ అధికారులు 

డిపాజిట్‌ కాకుండా నేరుగా రమ్మని..
కొత్తగా కనిపిస్తున్న వాహనాలు తక్కువ ధరకు విక్రయానికి ఉన్నాయని ఓఎల్‌ ఎక్స్‌ పోస్టు ద్వారా నమ్మినవారు ఎవరైనా సంప్రదిస్తే అసలు కథ మొదలెడుతున్నారు. ఇలా ఫోన్‌ ద్వారా సంప్రదిస్తే వాహనాలను చూపించాలన్నా, డెలివరీ ఇవ్వాలన్నా అడ్వాన్స్‌గా కొంత మొత్తం చెల్లించాలని చెప్పేవారు. దీనికోసం బోగస్‌ వివరాలతో తెరిచిన తమ బ్యాంకు ఖాతాలతోపాటు వివిధ వ్యాలెట్స్‌లోకి ఆ నగదు బదిలీ చేయించుకుని ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసేసేవారు. 

అడుగుపెట్టగానే అపహరించి...
ఈ మాటలు నమ్మినవారు ఎవరైనా నగదుతో అక్కడకు చేరుకుంటే వెంటనే సీన్‌ మారి పోతోంది. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో వేచి ఉండే ఆ ముఠాలు కస్టమర్లను కిడ్నాప్‌ చేస్తున్నాయి. అక్కడి నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకువెళ్లి నగదు, బంగారం దోపిడీ చేస్తున్నాయి. అంతటితో ఆగకుండా వారిని ఏటీఎం కేంద్రాలకు తీసుకువెళ్లి వీలున్నంత వరకు డ్రా చేయించి స్వాహా చేసి తీవ్రంగా భయపెట్టి వదిలిపెడుతున్నారు. బాధితులు అక్కడి పోలీసుల్ని ఆశ్రయించినా ఫలితం లేకుండా ఉండేందుకు హర్యానా పరిధిలో నేరం చేస్తే వెంటనే దగ్గరలోనే ఉండే యూపీ లేదా రాజస్థాన్‌ పరిధిలోకి వెళ్లిపోయి కొన్నిరోజులు తలదాచుకుంటున్నాయి. 

ఇటీవల ఓ వ్యక్తికి తక్కువ ధరకు కారును ఆశగా చూపి హర్యానాలోకి హొటల్‌కు రప్పించి నిలువు దోపిడీ చేసి పంపాయి. ఆ బాధితుడి ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. కేసు నమోదుకు సంబంధించి న్యాయపరమైన సలహా తీసుకోవాలని నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement