న్యూ సెంచరీ పబ్లిక్ స్కూల్ సీజ్

New Century Public School Was Sieged By Government Officials - Sakshi

హైదరాబాద్‌ : కూకట్‌పల్లిలోని న్యూ సెంచరీ పబ్లిక్‌ స్కూల్‌ను సీజ్‌ చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి విజయ కుమారి వెల్లడించారు. విద్యా సంవత్సరం మధ్యలో స్కూలు సీజ్‌ చేయాలని నిర్ణయించడంతో, విద్యార్థులు నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులను న్యూసెంచరీ పబ్లిక్‌ స్కూల్‌కి దగ్గరో ఉన్న పాఠశాలల్లో చదివిస్తామని హామీ ఇచ్చారు. ఫీజుల విషయమై ఆయా పాఠశాల యాజమాన్యాలతో సంప్రదించి తల్లిదండ్రులపై భారం పడకుండా చూస్తామని చెప్పారు. సిలబస్‌ కరిక్యూలర్‌ ప్రకారం ఉంటుంది కాబట్టి సిలబస్‌ విషయంలో విద్యార్థులు సమస్యను ఎదుర్కొనే అవకాశాలు లేవని తెలిపారు.

ఇప్పటికే గోడ కూలి ఇద్దరు విద్యార్థులు మృతిచెందటంతో న్యూ సెంచరీ పబ్లిక్‌ స్కూలు కూల్చివేతకి జీహెచ్‌ఎంసీ నోటీసులు జారీ చేయనుంది. మొదటి నోటీసుకి 15 రోజుల గడువు, ఆ తర్వాత 7 రోజుల గడువుతో మరో నోటీసు ఇవ్వనున్నారు. చివరగా 24 గంటల గడువుతో నోటీసు ఇస్తారు. యాజమాన్యం నుంచి ఎటువంటి స్పందన లేని సందర్భంలో స్కూలును పూర్తిగా నేలమట్టం చేసేందుకు జీహెచ్‌ఎంసీ చర్యలు తీసుకోనుంది.

శుక్రవారం జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాస రెడ్డి న్యూ సెంచరీ పబ్లిక్‌ స్కూల్‌ను పరిశీలించారు. శిథిలావస్థలో ఉన్న భవనంలో స్కూల్‌ను నిర్వహించడం సరికాదన్నారు. చనిపోయిన వారికి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తుందని, గాయపడిన వారికి ప్రభుత్వం వైద్య ఖర్చులు భరిస్తుందని హామీ ఇచ్చారు. పలువురు విద్యార్థి సంఘాల నాయకులు స్కూలు బస్సులపై దాడి చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిరసనకారులు స్కూల్లోకి ప్రవేశించి ఫర్నిచర్‌ను కూడా ధ్వంసం చేశారు.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top