
బాషా ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టు.. పాతికేళ్లుగా నలిగిపోయిన డైలాగ్ ఇది..కానీ విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఇప్పుడు ఇదే డైలాగ్‌కు కొత్త వెర్షన్ వినిపిస్తోంది. ‘నేను ఒక్కసారి చెబితే ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు వందసార్లు చెప్పినట్లే’.. అంటూ టీడీపీ పార్టీ నేత కాళ్ల శంకర్ హల్‌చల్ చేసేస్తుంటాడు. లిక్కర్ సిండికేట్ వ్యవహారాలు, సెటిల్‌మెంట్లు, ఇతరత్రా అన్ని వ్యవహారాలను ఎమ్మెల్యే తరఫున చక్కబెట్టేస్తుంటాడు.. చక్రం తిప్పేస్తుంటాడు.. సరే.. వారిద్దరి మధ్య లావాదేవీలు.
అనుబంధాల గురించి వారు ఏం చెప్పుకున్నా ఎవరికీ ఇబ్బంది లేదు కానీ.. చివరికి న్యాయవాదులను సైతం ఎమ్మెల్యే పేరు చెప్పి సదరు శంకర్ బెదిరింపులకు దిగడమే ఇప్పుడు చర్చనీయాంశం.. కోర్టుల్లో తేలాల్సిన కేసులను తానే బయట సెటిల్ చేస్తానని వకాలత్ నుంచి తప్పుకోవాలని వేధింపులకు గురి చేస్తున్నాడు.. ఓ జంట విడాకుల కేసు.. ఓ ఇంట్లో జరిగిన చోరీ కేసుల వాదనల నుంచి తప్పుకోవాలంటూ న్యాయవాదులను ఒత్తిళ్లకు, పోలీసులను ప్రలోభాలకు గురిచేయడం వివాదాస్పదమవుతోంది. –సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఎమ్మెల్యేల పేర్లు చెప్పి చోటామోటా నేతలు సెటిల్‌మెంట్లు, పంచాయితీలు చేసేయడం సహజమే. కానీ కోర్టులో ఉన్న కేసులను సైతం నేను బయట సెటిల్ చేస్తానంటూ బరితెగించి న్యాయవాదులనే బెదిరిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అనుచరుడు కాళ్ల శంకర్ వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. నగరంలోని దొండపర్తికి చెందిన ఓ మహిళ తన భర్త మస్తాన్‌వలిపై గృహహింస చట్టం కింద కేసు నమోదు చేసింది. కోర్టులో ఆ మహిళ తరఫున న్యాయవాది ఎం.శ్రీలక్ష్మి వాదిస్తున్నారు. అయితే ఈ కేసు తేలకముందే ఆ మహిళ చింతపల్లి అటవీశాఖ కాంట్రాక్టు ఉద్యోగం చేస్తున్న ఖాదర్‌బాషాను వివాహం చేసుకున్నట్టు తెలిసింది. దీంతో న్యాయవాది శ్రీలక్ష్మి ఇలాంటి కేసు తాను వాదించలేనని స్పష్టం చేసింది. వాస్తవాలను దాచిపెట్టి తనకు సమగ్ర సమాచారం ఇవ్వకుండా కేసు తప్పుదోవపట్టించడం సరికాదని చెప్పింది. అయితే ఆ కేసును విడాకుల కేసుగా మార్చి రాజీ చేయాల్సిందిగా ఆ మహిళ, కుటుంబ సభ్యులు అభ్యర్ధించడంతో ఆ మేరకు అంగీకరించి న్యాయవాది కేసు వాది స్తూ వస్తున్నారు. తనకు విడాకులు ఇవ్వకుండానే మరో వివాహం చేసుకుం దంటూ సదరు మహిళపై మొదటి భర్త మస్తాన్‌వలి ఎదురుకేసు వేయడం, రెండో వివాహానికి సంబంధించి సాక్ష్యాధారాలు సేకరిస్తున్న నేపథ్యంలో ఆ కేసు తేలేవరకూ తనకు, కుటుంబ సభ్యుల కు ఆశ్రయం ఇవ్వాలని ఆ మహిళ కోరడంతో నగరానికి చెందిన న్యాయవాది ఆనంద్ తనఇంట్లో ఆశ్రయం కల్పించారు.
కాళ్ల దూకుడుతో అడ్డం తిరిగిన కేసు
కేసు కొలిక్కి వస్తుందనుకున్న సమయంలో గత ఆగస్టు 12న ఆనంద్ ఇంట్లో చోరీ జరిగింది. వెండి వస్తువులతో పాటు 38వేల రూపాయల నగదు చోరీకి గురయ్యాయి. తన ఇంట్లో ఉంటున్న సదరు మహిళ, ఆమె కుటుంబ సభ్యులపైనే అనుమానం వ్యక్తం చేస్తూ ఆనంద్ నాలుగో టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. మొదటి నుంచి వాస్తవాలు తొక్కిపెట్టడం, ఆ మహిళకు తప్పుడు చిరునామాలతో రెండు ఆధార్‌కార్డులు ఉన్నాయని తేలడం, ఆశ్రయమిచ్చిన తన తోటి న్యాయవాది ఇంట్లోనే చోరీ జరగడంతో ఇక విడాకుల కేసు తాను వాదించలేనని శ్రీలక్ష్మి ఆ మహిళకు స్పష్టం చేసేశారు. 2014 నుంచి కేసు వాదిస్తున్నందున తన ఫీజును సెటిల్ చేయాల్సిందిగా ఆ మహిళ, కుటుంసభ్యులను కోరారు. సరిగ్గా ఇక్కడే టీడీపీ నేత కాళ్ల శంకర్ రంగంలోకి దిగారు. నేరుగా న్యాయవాది శ్రీలక్ష్మికి ఫోన్ చేసి.. ‘నేను కాళ్ల శంకర్.. ఆ కేసు వదిలేయండి’.. అని మాట్లాడారు. ఆ కేసును నేనే వద్దనుకున్నా.. కానీ ఫీజు కూడా ఎగ్గొట్టి బెదిరింపులకు దిగడం ఏమిటో అర్ధం కావడం లేదని అని న్యాయవాది శ్రీలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఫోర్త్‌టౌన్‌లో చోరీ విషయమై ఫిర్యాదు చేసిన న్యాయవాది ఆనంద్‌ను కూడా శంకర్ వదలిపెట్టలేదు.
కేసు విచారణ ఏమైందని కనుక్కోవడానికి వెళ్లిన ఆనంద్‌ను ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే.. ఈ కేసు వదిలేయ్.. కోర్టులు,. స్టేషన్లు ఎందుకు.. ఏమైనా ఉంటే నేను సెటిల్ చేస్తాలే .. అని బెదిరింపు ధోరణిలో మాట్లాడినట్టు ఆనంద్ చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే వెలగపూడికి నేను ఎంత చెబితే అంతే.. మీరు వాళ్ళ జోలికి వెళ్లకండి.. వాళ్లు నాకు కావాల్సిన వాళ్లు అని చెప్పగా.. పోలీస్ స్టేషన్‌లోనే ఇవన్నీ ఎందుకు నేను బయటికొచ్చి మాట్లాడతానండీ .. అని సమాధానమిచ్చినట్టు ఆనంద్ చెబుతున్నారు. విడాకుల కేసు వాదించిన, కేసు విచారణలో భాగంగా ఆశ్రయమిచ్చిన న్యాయవాదులపైనే ఎమ్మెల్యే అనుచరుడు బెదిరింపులకు దిగిన వైనం ఇప్పుడు న్యాయవాదవర్గాల్లోనే చర్చనీయాంశమవుతోంది. కాగా. చోరీ కేసు విచారణ చేపట్టాల్సిన పోలీసులు దాన్ని అటెక్కించేయడం వివాదాస్పదమవుతోంది. తాను అనుమానితుల పేర్లు చెప్పినా ఇంతవరకు కనీసం వారిని పిలిచి విచారించలేదని న్యాయవాది ఆనంద్ ఆరోపిస్తున్నారు. కాళ్ల శంకర్ రంగప్రవేశంతోనే కేసును పక్కనపడేశారని ఆనంద్ ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై సీఐ రాంబాబును సాక్షి ప్రశ్నించగా.. కేసు విచారణ మొత్తం ఎస్‌ఐ రమేష్ చూస్తున్నారని చెప్పారు. ఎస్‌ఐ రమేష్ వద్ద ప్రస్తావించగా.. కేసు విచారణ ఇంకా కొనసాగుతోందని ముక్తసరిగా చెప్పారు.