పారిపోయి వచ్చేస్తున్నారు ..! | Missing children at the childline office | Sakshi
Sakshi News home page

పారిపోయి వచ్చేస్తున్నారు ..!

Jun 4 2018 11:50 AM | Updated on Jun 4 2018 11:50 AM

Missing children at the childline office - Sakshi

బాలుడిని తల్లిదండ్రులకు అప్పగిస్తున్న చైల్డ్‌లైన్‌ సభ్యులు  

విజయనగరం ఫోర్ట్‌ : కొమరాడ మండలం విక్రమపురానికి చెందిన 12 ఏళ్ల బాలుడు తల్లిదండ్రులు మందలించారని ఇంటి నుంచి పారిపోయి రైల్లో విజయనగరానికి శనివారం చేరుకున్నాడు. అనుమానాస్పదంగా తిరుగుతున్న బాలుడిని చైల్డ్‌లైన్‌ సభ్యులు గుర్తించి  సంరక్షణ కల్పించారు. అనంతరం తల్లిదండ్రులకు సమాచారం అందించి బాలల సంక్షేమ కమిటీ సూచనల మేరకు చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. 

విశాఖపట్నం పూర్ణమార్కెట్‌ ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలుడు తల్లి మందలించిందని కొద్ది రోజుల కిందట ఇంటి నుంచి పారిపోయి విజయనగరం వచ్చేశాడు. చైల్డ్‌లైన్‌ 1098 సంస్థ సభ్యులు బాలుడిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. 

 ఇలా అనేక మంది ఇంటి నుంచి పారిపోయి వచ్చేస్తున్నారు. తల్లిదండ్రులు మందలించారని కొంతమంది.. పట్టణాలు చూద్దామని మరి కొందరు.. ఇంటి నుంచి పారిపోయి వచ్చేస్తున్నారు.  ఇంటి నుంచి పారిపోయి వచ్చే సమయాల్లో పోలీసులకు గాని, చైల్డ్‌లైన్‌ సభ్యులకు గాని దొరికితే ఫర్వాలేదు.  పొరపాటును ఏ అగంతుకులకో దొరికితే పిల్లల పరిస్థితి అంతే సంగతి.

మూడేళ్ల కాలంలో..

మూడేళ్ల కాలంలో ఇళ్ల నుంచి పారిపోయి పట్టణానికి వచ్చేసిన వారు సుమారు వంద మంది వరకున్నారు. వీరిలో అధికశాతం మంది తల్లిదండ్రులు మందలిస్తే పారిపోయి వచ్చిన వారే.  ఈ సంఖ్య కేవలం అధికారులకు పట్టుబడిన చిన్నారులు మాత్రమే. ఇలా లెక్కకు దొరకని చిన్నారులు ఇంకెంతమంది ఉన్నారో చెప్పలేం. 

ఇష్టాలు తెలుసుకోలేకపోతున్నారు.. 

 పిల్లల ఇష్టాలను తల్లిదండ్రులు తెలుసుకోలేకపోతున్నారు. విధి నిర్వహణలో బిజీగా ఉంటూ పిల్లల ప్రవర్తనను చాలామంది గుర్తించ లేకపోతున్నారు. అసలు వారు ఏమి చేస్తున్నారో కూడా తెలుసుకోలేనంత బిజీలో తల్లిదండ్రులు ఉండడం బాధాకరం. పిల్లల ఇష్టాలను తెలుసుకోకుండా మందలించడం, కొట్టడం వల్ల వారి మనసులు గాయపడి ఇళ్ల నుంచి పారిపోతున్నారు. చిన్నారుల అభిప్రాయాలను తెలుసుకుని వారికి  సముచిత స్థానం కల్పిస్తే ఇటువంటి సంఘటనలు జరగవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గొడవల వల్లే..

పిల్లల ఎదుటే తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గొడవలు పడుతుండడం వల్ల చిన్నారులు మనసు గాయపడుతుంది. దీంతో వారు ఎటైనా పారిపోవాలనే ఉద్దేశానికి వస్తారు. అలాగే సోషల్‌ మీడియాలో చూపిస్తున్న ప్రదేశాలను చూడాలని కూడా కొంతమంది పట్టణాలకు వచ్చేస్తున్నారు. ఇంట్లో స్వేచ్ఛ ఉండడం లేదని.. తల్లిదండ్రులు మందలించారని చాలా మంది పిల్లలు ఇంటి నుంచి పారిపోయి వచ్చేస్తున్నారు. – కేసలి అప్పారావు, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిన్‌ సభ్యుడు

 ప్రవర్తన గమనించాలి..

 పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. వారి ఇష్టాఇష్టాలను తెలుసుకోవాలి. ప్రతి చిన్న విషయానికీ కొట్టడం, తిట్టడం చేయడం వల్ల ఇంటి నుంచి పారిపోయే అవకాశం ఉంటుంది. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. మంచి చెడుల గురించి చెప్పేవారు. కాని నేటి తల్లిదండ్రులు పిల్లలు ఏమి చేస్తున్నారో కూడా గమనించడం లేదు.  

– వావిలాల లక్ష్మణ్, జిల్లా బాలల సంక్షేమ సమితి అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement