హత్యా బెదిరింపులు

Meera Mithun Complaint on Life Threats Phone Calls in Tamil Nadu - Sakshi

నటి మీరామిథున్‌ పిర్యాదు

పెరంబూరు: హత్యాబెదిరింపులపై నటి మీరామిథున్‌ చెన్నై పోలీస్‌కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. వివరాలు చూస్తే 8 తోట్టాగళ్, తానా సేర్నద కూట్టం చిత్రాల్లో నటించిన నటి మీరామిథున్‌. ఈమె గురువారం ఉదయం 11గంటల ప్రాంతంలో స్థానిక వెప్పేరిలోని పోలీస్‌కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. అంతకుముందు మీడియాతో మీరామిథున్‌ మాట్లాడుతూ తాను ఎంతో పారాడి మిస్‌ సౌత్‌ఇండియన్‌ కిరీటాన్ని గెలుచుకున్నానని చెప్పింది. అలా అందాల పోటీల్లో పాల్గొని కిరీటం గెలుచుకోవడం సులభమైన విషయం కాదంది. 15 ఏళ్లగా జరుగుతున్న మిస్‌ సౌత్‌ఇండియన్‌ పోటీల్లో తొలిసారిగా కిరీటం గెలుచుకున్న మహిళను తానేనని చెప్పింది. తన మాదిరి తమిళ యువతులు కష్టపడరాదన్న తలంపుతో తానే అందాల పోటీలను నిర్వహించడానికి సిద్ధం అయ్యానని చెప్పింది. మిస్‌ తమిళ్‌ దివా పేరుతో సోమవారం ఈ అందాల పోటీలను నిర్వహించనున్నట్లు చెప్పింది.

ఈ పోటీలను నిర్వహించకూడదంటూ ఇతర రాష్ట్రాల నుంచి తనకు పలు బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని చెప్పింది. ఈ పోటీల్లో పాల్గొనే మహిళలకు బెదిరింపు పోన్లు వస్తున్నాయని తెలిపింది. ఆరు నెలలుగా తాను వస్తున్న ఇలాంటి ఫోన్లను పక్కన పెడుతూ వచ్చానని,  వారం రోజులుగా తనకు హత్యాబెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని చెప్పింది. దీంతో ఈ రోజు పోలీస్‌కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేయడానికి వచ్చానని తెలిపింది. తాను నిర్వహించనున్న అందాల పోటీలకు పోలీసులు భద్రత కల్పిస్తారనే నమ్మకం ఉందని నటి మీరామిథున్‌ పేర్కొంది.
మీరామిథున్‌

బాలీవుడ్‌ గాయకుడి పేరుతో మోసం
పెరంబూరు: మోసపోయేవాళ్లు ఉన్నంత వరకూ మోసగాళ్లు పెరుగుతూనే ఉంటారు. ఏ విషయంలోనైనా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. లేకుంటే ఈ విధంగా మోసపోతుంటారు. కోవై, ఉళుందూర్‌కు చెందిన మహేంద్రవర్మన్‌ అనే బీఎడ్‌ పట్టభద్రుడు బాలీవుడ్‌ ప్రముఖ గాయకుడు అర్మాన్‌మాలిక్‌ పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ను రూపొందించి యువతులను బెదిరించి సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నించాడు. హింది గాయకుడి పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ను ప్రారంభించి తద్వారా యువతులను ఆకర్షించాడు. ఆ తరువాత వారితో స్నేహం చేసి ట్విట్టర్‌ ద్వారా వారి ఆంతరంగిక ఫొటోలను రాబట్టుకున్నాడు. ఆ ఫొటోలను మార్ఫింగ్‌ చేసి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేస్తానని బెదిరించి వారి నుంచి డబ్బు గుంజుతున్నాడు. ఈ విధంగా 15 మంది వద్ద రూ.50 లక్షల వరకు దోచుకున్నాడు. అతని బాధితురాలైన కోవైకు చెందిన ఒక యువతి ధైర్యం చేసి కోవై నేర పరిశోధనా శాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన ఇన్‌స్పెక్టర్‌ యమున, సబ్‌ఇన్‌స్పెక్టర్‌ అరుణ్‌ నిందితుడిని పట్టుకునేందుకు పకడ్బందీగా పథకం రూపొందించారు. ఫిర్యాదు చేసిన యువతిని మహేంద్రవర్మన్‌తో మాట్లాడించి డబ్బు ఇస్తానని ఒక చోటుకు రావలసిందిగా చెప్పించారు. బుధవారం అతను ఆ యువతి చెప్పిన ప్రాంతానికి రాగా అక్కడ దాగిఉన్న పోలీసులు చుట్టుముట్టి అరెస్ట్‌ చేశారు. విచారణలో మహేంద్రవర్మన్‌ గత ఏదాడిన్నరగా మహిళలను ఇలాంటి బెదిరింపులకు గురి చేస్తూ డబ్బు గుంజుతున్నట్లు తెలిసింది. దీంతో అతనిపై నమోదు చేసి విచారిస్తున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top