దాగని నిజం

man suicide attempt over fear of techie murder - Sakshi

ఆత్మహత్యాయత్నంతో హత్య వెలుగులోకి.. 

గత నెల 31న కర్మన్‌ఘాట్‌లో కార్పెంటర్‌ హత్య కేసులో వీడిన మిస్టరీ 

స్నేహితుడి సహకారంతో  భర్తను హత్యచేసిన భార్య  

చౌటుప్పల్‌లో మృతదేహం పారవేత 

సహకరించిన నాలుగో వ్యక్తి  ఆత్మహత్యాయత్నం 

పోలీసుల అదుపులో నిందితులు 

సాక్షి, సిటీబ్యూరో: గురువారం ఉదయం 8 గంటల ప్రాంతం... లాలాపేటలోని గడ్డిచేలో ఓ యువకుడు హఠాత్తుగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు... స్థానికుల సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు... ప్రాథమిక విచారణ నేపథ్యంలో గత నెల 30న జరిగిన ఓ హత్య వెలుగులోకి వచ్చింది... ఆ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తే పోలీసుల భయంతో ఆత్మహత్యకు యత్నించాడు... ఈ కేసుకు సంబంధించి నలుగురు నిందితులను చౌటుప్పల్‌ పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు... దీంతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన యువకుడినీ వారికే అప్పగించనున్నారు.  

ప్రియుడి సహకారంతో భర్త హత్య... 
కర్మన్‌ఘాట్‌ ప్రాంతానికి చెందిన కార్పెంటర్‌ నాగరాజు జ్యోతి దంపతులు. వివాహానికి ముందు నుంచి జ్యోతికి నగరానికి చెందిన కార్తీక్‌ అనే యువకుడితో పరిచయం ఉండేది. భర్తతో కాపురం చేయడం ఇష్టం లేని ఆమెను నాగరాజు అడ్డుగా ఉన్నాడని భావించి భర్తను హతమార్చేందుకు కార్తీక్‌తో కలిసి పథకం వేసింది. ఈ నేపథ్యంలో గత నెల 30న జ్యోతి పథకం ప్రకారం తన భర్తకు నిద్రమాత్రలు ఇచ్చింది. ఆపై కార్తీక్‌ను ఇంటికి రప్పించింది. ఇద్దరూ కలిసి నాగరాజును హత్య చేశారు. పోలీసులకు చిక్కకూడదనే ఉద్దేశంతో మృతదేహాన్ని మాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు కార్తీక్‌ తన స్నేహితులైన దీపక్, యాసీన్‌లను రమ్మని కోరాడు. దీనికి యాసీన్‌తో పాటు అంగీకరించిన దీపక్‌ మరొకరినీ తీసుకువెళ్లాలని భావించాడు  

నరేష్‌ను తీసుకెళ్లిన దీపక్‌... 
లాలాపేట లక్ష్మీనగర్‌కు చెందిన  నరేష్‌తో (23)  దీపక్‌కు పరిచయం ఉండటంతో మృతదేహం తరలింపు కోసం అతడి సహకారం తీసుకోవాలని దీపక్‌ భావించాడు. అదే రోజు లక్ష్మీనగర్‌కు వచ్చిన దీపక్‌ తనతో రావాలని, ఓ మృతదేహం తరలింపునకు సహకరించాలంటూ నరేష్‌ను కోరగా, అందుకు అతను నిరాకరించడంతో బయటకు వెళ్ళి వద్దామంటూ చెప్పిన దీపక్‌ నరేష్‌ను తీసుకుని కర్మన్‌ఘాట్‌ చేరుకున్నాడు. అనంతరం ముగ్గరూ కలిసి కారులో మృతదేహాన్ని తీసుకువెళ్లి చౌటుప్పల్‌ జిల్లెలగూడ గుట్టల్లో పారవేసి తిరిగి వచ్చారు. 31న డెడ్‌బాడీని గుర్తించిన చౌటుప్పల్‌ పోలీసులు హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.  కేసు దర్యాప్తు చేపట్టిన చౌటుప్పల్‌ పోలీసులు మృతుడిని నాగరాజుగా గుర్తించి జ్యోతికి సమాచారం అందించారు. సాంకేతిక ఆధారాలను బట్టి  నిందితుల్ని గుర్తించారు. బుధవారం మిగిలిన నిందితులతో పాటు దీపక్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన అతడి సోదరుడు ఆ రోజు నరేష్‌ కూడా దీపక్‌తో వెళ్ళినట్లు గ్రహించాడు. దీంతో లక్ష్మీనగర్‌లోని నరేష్‌ ఇంటికి వెళ్ళిన దీపక్‌ సోదరుడు అతడిని మందలించడమేగాక చేయి చేసుకున్నాడు. ఈ పరిణామంతో తనను కూడా పోలీసులు పట్టుకుంటారని భావించిన నరేష్‌ పోలీసులకు లొంగిపోవాలనుకున్నాడు. గురువారం ఉదయం ‘100’కు ఫోన్‌ చేసి తనకు ఓ హత్య విషయం తెలుసని, పోలీసులు చెప్పాలనుకుంటున్నానని, ఏలా చెప్పాలంటూ అడిగాడు. దీంతో స్థానిక పోలీసుస్టేషన్‌కు వెళ్ళాలని, లేదంటే చిరునామా చెప్తే తామే పోలీసులను పంపిస్తామన్నారు.  

తొలుత తప్పుడు వివరాలు చెప్పినా... 
తానే పోలీసుస్టేషన్‌కు వెళ్తానన్న నరేష్‌.. లాలాగూడ ఠాణాకు వెళ్లాలని భావించాడు. గడ్డిచేను వరకు చేరుకున్న అతను భయంతో తన వద్ద ఉన్న బ్లేడ్‌తో గొంతు కోసుకున్నాడు. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలికి చేరుకున్న వారు నరేష్‌ను  గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంలో నరేష్‌ మాట్లాడుతూ... గత నెల 30న తన స్నేహితుడు దీపక్‌ తనను తీసుకువెళ్లాడని, అతడు మరికొందరితో కలిసి హైటెక్‌ సిటీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసే ఓ వ్యక్తి చంపినట్లు తెలిపారు. ఆపై తాము మృతదేహాన్ని నల్లగొండ చెరువులో పారవేశామన్నారు. మిగిలిన వాళ్ళు పోలీసులకు చిక్కడంతో తాను భయపడ్డానన్నాడు. ఈ విషయం విని కంగుతిన్న లాలాగూడ పోలీసులు మాదాపూర్‌ పోలీసుల్ని సంప్రదించినా ఫలితం దక్కలేదు.  

దీపక్‌ కాల్‌ డిటేల్స్‌ పరిశీలించడంతో... 
నరేష్‌ నోటి వెంట దీపక్‌ పేరు పదేపదే వస్తుండడంతో అతడి ఫోన్‌ నంబర్‌ సేకరించిన పోలీసులు కాల్‌ డిటేల్స్‌ ఆరా తీశారు. అందులో ఓ నంబర్‌తో ఎక్కువసార్లు సంప్రదింపులు ఉండడంతో ఆ నంబర్‌కు లాలాగూడ పోలీసులు కాల్‌ చేశారు. ఈ నేపథ్యంలోనే తాను చౌటుప్పల్‌ పోలీసు అధికారినంటూ చెప్పిన అవతలి వ్యక్తి నాగరాజు హత్య నుంచి దీపక్‌ను అదుపులోకి తీసుకోవడం వరకు వివరించారు. దీంతో అప్రమత్తమైన లాలాగూడ అధికారులు నరేష్‌ వివరాలను చౌటుప్పల్‌ పోలీసులకు అందించారు. గాంధీ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం అతడిని చౌటుప్పల్‌ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం చౌటుప్పల్‌ పోలీసుల అదుపులో ఉన్న నిందితులను శుక్రవారం అరెస్టు ప్రకటించే అవకాశం ఉంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top