నా బిడ్డను భర్తే చంపేశాడు..

Man Kills Wife Over Dowry In Jangaon - Sakshi

పెళ్లైన మూడు రోజుల నుంచే వేధింపులు

పోలీసులకు ఫిర్యాదు చేసిన మమత తల్లిదండ్రులు 

భర్త, అత్త, మామ, మరిదిపై కేసు

జనగామ : అదనపు కట్నం కోసం నా బిడ్డను అత్తింటి వారు వేధిస్తే.. వ్యవసాయ బావి వద్దకు తీసుకు వెళ్లి భర్త కడతేర్చారని మృతురాలి తల్లిదండ్రులు భూషణబోయిన కనకయ్య, కనకవ్వ ఆరోపించారు. జనగామ మండలం వెంకిర్యాల గ్రామంలో ఈ నెల 28న అనుమానాస్పద స్థితిలో దుర్గం మమత అలియాస్‌ కీర్తన మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై సోమవారం సీఐ మాట్లాడుతూ మార్చి 31న వెంకిర్యాల గ్రామానికి చెందిన దుర్గం పరుశరాములతో మమతను ఇచ్చి వివాహం జరిపించారు.

వివాహం సమయంలో రూ.5.30లక్షల కట్నం, 3 తులాల బంగారం, 22 తులాల వెండి ఆభరణాలు ఇచ్చారు. వివాహం జరిగిన కొద్ది రోజులకే ద్విచక్రవాహనం కావాలని భర్త వేధిస్తే.. అత్త లక్ష్మి, మామ బాలయ్య, మరిది నర్సింహులు అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేశారని మృతురాలి తల్లిదండ్రులు తెలిపారు. ఉగాది పండగ రోజున మమత భర్తతో కలిసి పుట్టింటికి వెళ్లగా, మొపైడ్‌ వాహనం కొనిచ్చే ఆర్థిక స్థోమత లేదని అల్లున్ని వేడుకుని.. రూ.30 వేలు నగదును అందజేశారు. ఈ క్రమంలో ఈనెల 28న భర్తతో కలిసి తమ వ్యవసాయ బావి వద్ద కుక్కలకు భోజనం పెట్టేందుకు మమత వెళ్లింది. అక్కడ ఏం జరిగిం దో తెలియదు కానీ.. బావిలో పడి మమత శవమై తేలింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. ఇన్‌చార్జి ఏసీపీ వెంకటేశ్వరబాబు కేసు విషయమై విచారణ చేస్తుండగా, జనగామ తహసీల్దార్‌ రవీందర్‌ శవపంచనామా చేసిన అనంతరం మృతదేహానికి పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సర్పంచ్‌ కీర్తి లక్ష్మినర్సయ్యతో పాటు పలువురు పోలీసుల విచారణలో పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top