పెళ్లయిన నెలరోజులకే మృత్యుఒడికి   | Man Died In Road Accident | Sakshi
Sakshi News home page

పెళ్లయిన నెలరోజులకే మృత్యుఒడికి  

Jul 25 2018 1:44 PM | Updated on Sep 2 2018 4:52 PM

Man Died In Road Accident - Sakshi

వివాహానికి ముందు కారులో వెళుతున్న సంతోష్, జ్యోతి 

ఆ గుమ్మాలకు కట్టిన మావిడాకులు ఇంకా వాడలేదు. ఆ ఇంట్లో అడుగుపెట్టిన పెళ్లి కూతురు కాళ్ల పారాణి ఆరలేదు. చేతికి పెట్టుకున్న గోరింటాకు ఇంకా విడిచిపెట్టలేదు. బంధువులు, కుటుంబ సభ్యుల ఇళ్లకు ఇంకా ఆ జంట పూర్తిగా వెళ్లనే లేదు. ఆషాఢం పూర్తయ్యాక తీర్థయాత్రలు చేయాలనుకున్న ఆ నవదంపతులు కల తీరలేదు.

ఎన్నో ఏళ్లు కలసి జీవించాలనుకున్న ఆ జంటపై విధి చిన్నచూపు చూసింది. లారీ రూపంలో ఆ యువకుడిని వెంటాడింది. రోడ్డు ప్రమాదంలో అతడు మృతి చెందడంతో.. పెళ్లింట తీవ్ర విషాదం అలుముకుంది. ఆ నవ వధువు గుండెలవిసేలా విలపిస్తున్న తీరు అందరినీ కలచివేసింది.  

బూర్జ విజయనగరం : మండలంలోని రామన్నపేట గ్రామానికి సమీపంలో మంగళవారం రాత్రి  రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో లారీ ఢీకొని తోటవాడ గ్రామానికి చెందిన ట్రాక్టర్‌ యజమాని బెహరా సంతోష్‌కుమార్‌(22) దుర్మరణం చెందాడు. తోటవాడ నుంచి పాలకొండ మండలం బాసూరులో తన చెల్లి ఇంటి వద్ద ఉన్న భార్యను తీసుకొచ్చేందుకు ద్విచక్రవాహనంపై వెళుతున్నాడు. ఇంతలో రామన్నపేట వద్ద పాలకొండ వెళుతున్న లారీకి ఓవర్‌ టేక్‌ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

దీంతో సంతోష్‌ సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. సంతోష్‌కుమార్‌కు ఒడిశా రాష్ట్రం లబ్బ గ్రామానికి చెందిన జ్యోతితో గత నెల 22 వివాహం జరిగింది. ప్రస్తుతం వ్యవసాయ పనుల బిజీగా ఉన్నాయి. దమ్ములు పూర్తి కాగానే ఆషాఢం వెళ్లాక తీర్థయాత్రలు చేయాలని ఎన్నో బాసలు చేసుకున్నారు. ఎన్నో కలలు కన్నారు. మూడు రోజులు కిందట పాలకొండలో జరుగుతున్న జగన్నాథస్వామి రథయాత్రకు వెళ్లారు.

బాసూరులో ఉన్న చెల్లి ఇంటికి తీసుకువెళ్లారు. మంగళవారం వచ్చి ఇంటికి తీసుకువెళ్తానని చెప్పారని కానీ ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని హృదయ విదారకంగా విలపిస్తున్న తీరు అందరినీ కదిలించింది. ఆ కాళ్ల పారాణి చెరగకముందే భర్త చనిపోవడంతో భార్య జ్యోతి కన్నీరుమున్నీరుగా రోదిస్తోంది. సంతోష్‌కుమార్‌ మృతదేహాన్ని పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయనకు భార్య జ్యోతి, అమ్మ మంగమ్మ, నాన్న సత్యం ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement