నిర్లక్ష్యం ఖరీదు.. నిండు ప్రాణం | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యం ఖరీదు.. నిండు ప్రాణం

Published Thu, May 30 2019 1:06 PM

Man Died With Current Shock in Vizianagaram - Sakshi

చీపురుపల్లి: గ్రామీణ విద్యుత్‌ సహకార సంఘ(ఆర్‌ఈసీఎస్‌) అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యానికి ఒక నిండు ప్రాణం బలవ్వగా మరో ఐదేళ్ల బాలుడి పరిస్థితి విషమంగా మారింది. నిండు నూరేళ్లు జీవించాల్సిన ముక్కుపచ్చలారని పదకొండేళ్ల బాలుడు వారి పుణ్యమాని లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. మరో చిన్నారి చావుబతుకుల మధ్య విజయనగరం ఆస్పత్రిలో ఉన్నాడు. మంగళవారం రాత్రి వీచిన గాలులకు తెగిపడిన విద్యుత్‌ తీగలను బుధవారం మధ్యాహ్నం వరకు తొలగించకపోవడంతో అటువైపుగా వెళ్లిన నిద్దాన సురేంద్ర (11), మీసాల హేమంత్‌ (5) వాటిని అనుకోకుండా తాకారు. ఈ ప్రమాదంలో సురేంద్ర మృతి చెందగా.. హేమంత్‌ తీవ్రంగా గాయపడ్డాడు. బుధవారం ఉదయమే తాతగారి ఇంటికి వచ్చిన సురేంద్ర ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంపై ఆ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. అంతవరకు కళ్లముందే ఆడుకుంటున్న చిన్నారులు అంతలోనే మృత్యువాత పడడంతో యలకలపేట గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

ఉదయమే తాతగారి ఇంటికి వెళ్లి....
మండలంలోని పుర్రేయవలస గ్రామానికి చెందిన నిద్దాన ఈశ్వరరావు, కుమారిలకు సురేంద్ర, ద్రాక్షాయని ఇద్దరు సంతానం. వీరు విజయవాడ వలస వెళ్లి అక్కడే నివాసం ఉంటున్నారు. అక్కడి నుంచి మంగళవారం స్వగ్రామమైన పుర్రేయవలస వచ్చారు. బుధవారం ఉదయం సురేంద్ర తన అమ్మమ్మగారి గ్రామమైన యలకలపేట  వెళ్లాడు. అక్కడ తోటి మిత్రులతో ఆడుకుంటూ నివాసాలకు అనుకుని ఉన్న ఆరటితోటలో గల బోరుకు స్నానానికి  వెళ్లాడు. ఈ మార్గంలో విద్యుత్‌ తీగలు తెగిపడి ఉన్నాయి. ఇది గమనించని సురేంద్ర, హేమంత్‌లు విద్యుత్‌ తీగలపై కాలు వేయడంతో షాక్‌కు గురై పక్కకు తుళ్లిపోయారు. వెంటనే తోటి స్నేహితులు గ్రామంలోకి వెళ్లి పెద్దలను పిలుచుకువచ్చారు. తీవ్రంగా గాయపడి ఉన్న చిన్నారులను చీపురుపల్లి ఆస్పత్రికి తరలిస్తుండగా... సురేంద్ర మృతి చెందాడు. హేమంత్‌కు ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించారు. విజయవాడలో ఏడో తరగతి చదువుతున్న సురేంద్ర తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

మంగళవారం రాత్రే..
మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో అదే సమయంలో యలకలపేట అరటితోటలో విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. గతంలో పలుమార్లు ఇదే ప్రాంతంలో విద్యుత్‌ తీగలు తెగిపోవడంతో గ్రామస్తుల ఫిర్యాదు మేరకు అధికారులు వాటికి ముడులు వేసి సరిచేశారు. తెగి పడిన విద్యుత్‌ తీగలను బుధవారం మధ్యాహ్నం  వరకు ఆర్‌ఈసీఎస్‌ సిబ్బంది సరి చేయలేదు. ఆర్‌ఈసీఎస్‌లో సీజేఎల్‌ఎమ్‌ నుంచి ఎ.డి వరకు ఎవ్వరూ పట్టించుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. సీజేఎల్‌ఎమ్‌ పాముకాటుకు గురై ఆస్పత్రిలో ఉన్నాడని ఆర్‌ఈసీఎస్‌ అధికారులు చెబుతున్నప్పటికీ ఆయన స్థానంలో మరెవ్వరూ లేకపోవడం శోచనీయం. ఇలాంటి సంఘటనలు మండలంలోని రామలింగాపురం, పుర్రేయవలసలో కూడా గతంలో జరిగాయి. పెదనడిపల్లిలో పాఠశాలకు వెళ్తున్న ఇద్దరు విద్యార్థినులపై విద్యుత్‌ తీగలు తెగిపడిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇంత జరుగుతున్నా ఆర్‌ఈసీఎస్‌ మాత్రం నిర్లక్ష్యాన్ని వీడడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

చలించని అధికారులు
ఆర్‌ఈసీఎస్‌ నిర్లక్ష్యం కారణంగా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో మరణాలు సంభవిస్తున్నా అధికారుల్లో చలనం రాకపోవడం శోచనీయం.  బలహీనంగా ఉండే విద్యుత్‌ తీగలు, ఎక్కడికక్కడే ముడులు కట్టిన వైర్లు ఉండడంతో గాలులు వీచే సమయంలో తెగిపడుతూ ప్రాణాలు బలిగొంటున్నాయి. వర్షం పడిన తర్వాత గ్రామస్థాయిలో ఉండే సిబ్బంది తమ పరిధిలో ఉండే విద్యుత్‌ లైన్లు ఎలా ఉన్నాయో సరి చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయలో ఉన్నతాధికారులు సైతం పట్టించుకోవడం లేదు.మంగళవారం రాత్రి విపరీతమైన గాలులతో కూడిన వర్షం కురిసింది. ఆ సమయంలో యలకలపేటలో గల అరటితోటలో విద్యుత్‌ తీగలు తెగిపోయి ఉండవచ్చు.అయితే ఈ విషయం మా దృష్టికి రాలేదు. 11 కేవీ విద్యుత్‌ లైన్‌లో తీగలు తెగిన వెంటనే తెలుస్తుంది. ఎల్‌టీ లైన్‌లో తెలిసే అవకాశం లేదు.   – బి.జగన్నాధం,  ఆర్‌ఈసీఎస్‌ ఎ.డి, చీపురుపల్లి

Advertisement
Advertisement