పండక్కి వెళ్తూ..

man dead in road accident - Sakshi

అదుపు తప్పి పడిన బైక్‌పైకి దూసుకెళ్లిన కారు

ఒకరి దుర్మరణం, మరొకరికి తీవ్రగాయాలు

కొడవలూరు: ఉపాధి కోసం జిల్లాకు వలస వచ్చి పండక్కి ఇంటికి వెళ్తూ ఓ వ్యక్తి దుర్మరణ పాలయ్యాడు. మరొకరు తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ విషాద ఘటన మండలంలోని రాచర్లపాడు వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు..  గుంటూరు జిల్లా ఊపూరు మండలం కాకర్లపూడికి చెందిన దాసరి కోటేశ్వరరావు (32), రవీంద్ర బేల్దారీ పనుల నిమిత్తం తడకు వలస వెళ్లారు. సంక్రాంతి పండగ నేపథ్యంలో స్వగ్రామానికి వెళ్లేందుకు బైక్‌లో బయల్దేరారు. కొడవలూరు మండలం రాచర్లపాడు చెరువు వద్దకు వచ్చే సరికి ముందు వెళుతున్న లారీని క్రాస్‌ చేయబోయి బైక్‌ అదుపు తప్పి రోడ్డుపై పడిపోయింది. ఇంతలోనే వెనుకనే వేగంగా వస్తున్న కారు వీరి పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కోటేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందగా, రవీంద్ర తీవ్రంగా గాయపడ్డారు.  క్షతగాత్రుడిని 108లో చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కోటేశ్వరరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్‌ రక్షణకుమార్‌ తెలిపారు.  

చెరకు ట్రాక్టర్‌ ఢీకొని వ్యక్తి మృతి
సంగం: రోడ్డు పక్కన నడిచి వెళ్తున్న ఓ వ్యక్తిని చెరకు ట్రాక్టర్‌ ఢీకొని మృతి చెందిన ఘటన సంగం సబ్‌స్టేషన్‌ వద్ద శుక్రవారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం మేరకు.. సంగం రాళ్లచెలికకు చెందిన కలికిరి వెంకటరత్నం (40) చేనేత కార్మికుడు. పనిలో కుటుంబపోషణ జరగకపోవడంతో ప్రైవేట్‌గా ఎలక్ట్రిషియన్‌ పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఇంట్లో నుంచి రోడ్డు మీదకు వచ్చి సబ్‌స్టేషన్‌ నుంచి బస్టాండ్‌ వైపు నడిచి వెళ్తుండగా వెనుకనే వచ్చిన చెరకు ట్రాక్టర్‌ అతన్ని ఢీకొంది. దీంతో అతను ట్రాక్టర్‌ చక్రాల కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రాక్టర్‌ డ్రైవర్‌ వెంటనే పరారయ్యాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు అతన్ని 108 వాహనంలో ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. కుటుంబానికి జీవనా«ధారమైన వెంకటరత్నం మృతితో భార్య పద్మ, కుమారుడు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నం టాయి. సంగం రాళ్లచెలికలో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్సై వేణు తెలిపారు. 

ఘటనా స్థలంలో కోటేశ్వరరావు మృతదేహం

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top