ఇరికించబోయి.. ఇరుక్కున్నారు

man arrest in bomb case - Sakshi

బాంబుల కేసు పెట్టబోయి దొరికిపోయారు

జమ్మలమడుగు/పెద్దముడియం : అప్పు చెల్లించలేక.. బాంబుల కేసులో ఇరికించాలనుకున్నారు.. ఇందుకోసం బాంబులు తయారు చేశారు.. అతని ఇంటి వెనుక పెట్టాలనుకున్నారు.. ఇందుకోసం వాటిని తీసుకొస్తుండగానే పోలీసులకు చిక్కిపోయారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ కె.కృష్ణన్‌ శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పెద్దముడియం మండలం కొండసుంకేసుల గ్రామస్తుడు రాంగోపాల్‌రెడ్డి.. అదే గ్రామానికి చెందిన విజయభాస్కర్‌రెడ్డి వద్ద రెండు లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు. డబ్బును పదే పదే అడుగుతుండటంతో ఎలాగైనా విజయభాస్కర్‌రెడ్డిపై తప్పుడు కేసు పెట్టి ఇబ్బందికి గురి చేయాలని రాంగోపాల్‌రెడ్డి నిర్ణయించుకున్నాడు.

ఇదే గ్రామానికి చెందిన బెల్టుషాపు నిర్వాహకుడు బాల చెన్నయ్యతో కలిసి ప్రణాళిక రూపొందించాడు. బాంబుల కేసు పెడితే బాగుంటుందని ఆలోచించారు. పక్కనే ఉన్న కోవెలకుంట్లకు వెళ్లి గంధకం, ఇనుపచువ్వలు, దారాలు తెచ్చుకుని రెండు బాంబులు తయారు చేశారు. వాటిని విజయభాస్కర్‌రెడ్డి ఇంటి వెనుక పెట్టాలని అనుకున్నారు. ఇందుకోసం వారు గ్రామానికి తీసుకొస్తున్నారు. మార్గంమధ్యలోని కొండసుంకేసుల, కల్వటాల  గ్రామాలకు వెళ్లే రహదారిపై బ్యాగు పట్టుకుని ఉన్నారు. అదే సమయంలో పెద్దముడియం ఎస్‌ఐ హరిప్రసాద్, తన సిబ్బందితో కలసి అదే రోడ్డుపై వెళుతున్నారు. వారు అనుమానాస్పదంగా కనిపించడంతో ఆరా తీశారు. బ్యాగులో బాంబులు ఉన్నట్లు గుర్తిం చారు. వారిని అరెస్ట్‌ చేసి, విచారణ చేపట్టడంతో విషయం వెలుగు చూసింది. వారిపై కేసు నమోదు చేసి, శుక్రవారం రిమాండ్‌కు తరలించారు.

తప్పుడు ఫిర్యాదు చేస్తే చర్యలు
ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చి ఇతరులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ కె.కృష్ణన్‌ హెచ్చరించారు. ఫ్యాక్షన్, బాంబుల సంస్కృతికి దూరంగా ఉండాలని రూరల్‌ సీఐ ఉమామహేశ్వరరెడ్డి తెలిపారు. సమావేశంలో అర్బన్‌ సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్‌ఐ సునీల్‌కుమార్‌రెడ్డి, రాఘవేంద్రారెడ్డి, హరిప్రసాద్‌ తదితరులు ఉన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top