రాయచూరులో మరో నిర్భయ ఘటన? 

Madhu Pattar parents demands justice for daughter who was brutally raped - Sakshi

సాక్షి, రాయచూరు:  ఉన్నత చదువులు చదివి ఉజ్వల భవితను అందుకుంటుందని ఆశించిన ముద్దుల కూతురు అనాథ శవమవుతుందని ఆ తల్లిదండ్రులు ఊహించలేకపోయారు. ప్రేమపేరుతో వెంటాడి వేధించిన ఓ యువకుడే ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. మధుకు సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు జరుగుతున్నాయి.  నగరంలోని ఇంజనీరింగ్‌ కళాశాలలో సివిల్‌ ఇంజనీరింగ్‌ రెండో ఏడాది విద్యార్థిని మధు పత్తార్‌ (23) అనుమానాస్పద మృతి కేసు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. మరో నిర్భయ ఘోరాన్ని తలపించే ఈ విషాదంపై  సినీ, ఇతర ప్రముఖులు సోషల్‌ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేస్తుండడం, తల్లిదండ్రులు తమ బిడ్డది ముమ్మాటికి హత్యేనని చెబుతుండడంతో చర్చనీయాంశమైంది. 

ఏం జరిగింది  
వివరాలు.. మధు పత్తార్‌ రాయచూరు నగరంలో ఐడీఎస్‌ఎంపీ లేఔట్‌లో తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఆమె తండ్రి  నాగరాజు పత్తార్ స్వర్ణకారుడు, తల్లి రేణుక గృహిణి. నగరంలోని నవోదయ ఇంజనీరింగ్, మెడికల్‌ కాలేజీలో సివిల్‌ ఇంజనీరింగ్‌ చదువుతోంది. నిత్యం కాలేజీకి వచ్చి వెళ్లేది. ఈ నెల 13న ఇంటర్నల్‌ పరీక్షలకు వెళ్లిన అమ్మాయి సాయంత్రమైనా ఇంటికి రాలేదు. మొబైల్‌కు ఫోన్‌ చేస్తే స్పందన రాలేదు. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు అదేరోజు సాయంత్రం మహిళా పోలీసు స్టేషన్‌కు వెళ్లి బిడ్డ కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. ఎక్కడికీ పోదు, వస్తుందిలే అని పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు తప్ప కేసు నమోదు చేసుకుని గాలించలేదు. మూడురోజులు గడిచిపోయాయి. 16వ తేదీన నగరంలోని మాణిక్‌ ప్రభు దేవాలయం వెనుకభాగంలో నిర్మానుష్యంగా వున్న గుట్టలపై యువతి శవం కనిపించింది. పోలీసులు ఆరా తీయగా అది మధు పత్తార్‌దేనని తల్లిదండ్రులు, స్నేహితులు గుర్తించారు.  

పలు అనుమానాలు  
‘నేను ఇంజనీరింగ్‌ కోర్సులో పలు సబ్జెక్టులు ఫెయిల్‌ అయ్యాను. నా మరణానికి నేనే బాధ్యురాలిని’ అని ఉత్తరం మృతదేహం దగ్గర దొరికిందని పోలీసులు తెలిపారు. మరోవైపు ఎండిపోయిన చెట్టుకు ఉరి వేసుకోవడానికి ఆస్కారం లేదు. ఆమె కూర్చున్న స్థితిలో ఉరివేసుకుని ఉంది. ఇది ఎలా సాధ్యమని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. సూసైడ్‌ నోట్‌ కన్నడలో రాసి ఉంది. తమ కూతురికి కన్నడ రాయడం అంతగా రాదని, హంతకుడే ఆ లేఖను రాసి ఆమెతో సంతకం చేయించి ఉంటాడని తల్లిదండ్రులు చెబుతున్నారు.  

ఆత్మహత్య కాదు హత్యే.. న్యాయం చేయాలి: మధు తల్లి మొర  
అనుమానాస్పద రీతిలో మరణించిన తమ కూతురు, విద్యార్థిని మధు పత్తార్‌ విషయంలో ప్రభుత్వం న్యాయం చేయాలని తల్లి రేణుక కోరారు. శనివారం ఇక్కడ పాత్రికేయల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తన కూతురుని చిత్రహింసలకు గురిచేసి, హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించిన హంతకులకు కఠిన శిక్ష విధించాలని ఆమె డిమాండ్‌ చేశారు.ఈ నెల 25వ తేదీన నగరంలో విద్యార్థులు, ప్రజలు, సంఘ సంస్థల సహకారంతో భారీ ఆందోళన నిర్వహిస్తామని ఆమె తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘోరాలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టాలని కోరారు. మధు తండ్రి నాగరాజు, విశ్వకర్మ సంఘాల నాయకులు పాల్గొన్నారు.   

అతనిపైనే సందేహాలు  
సుదర్శన్‌ యాదవ్‌ అనే యువకుడు ఐదు నెలల నుంచి ప్రేమపేరుతో మధు పత్తార్‌ను వెంబడిస్తున్నారని, మానసికంగా వేధిస్తున్నాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. ప్రేమించాలని ఒత్తిడి చేసేవాడని ఒత్తిడి చేసేవాడు. మధు అంగీకరించకపోవడంతో తనకు దక్కని ఆమె ఇంకొకరికి దక్కరాదని కక్ష పెంచుకున్నాడు. అర్జంటుగా మాట్లాడాలనే నెపంతో గుట్టలపైకి పిలుచుకెళ్లి చంపి చెట్టుకు వేలాడ దీసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని తల్లిదండ్రలు, సంఘ సంస్థల నాయకులు ఆరోపించారు.  

పోస్టుమార్టం నివేదిక రావాలి  
13వ తేదీనే మధు విగతజీవిగా మారింది. 16న మృతదేహం బయటపడింది. ఎండలకు మృతదేహం కమిలిపోయి గుర్తుపట్టలేనంతగా మాడిపోయింది. నేతాజి నగర్‌ పోలీసులు కేసు నమెదు చేసుకున్నారు. ఇది హత్యేనని, హంతకులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. కాగా, నిందితుడు సుదర్శన్‌ యాదవ్‌ ఇప్పటికే పోలీసులకు లొంగిపోయాడని, అతన్ని విచారిస్తున్నారని తెలిసింది. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాతే హత్య, ఆత్మహత్యనా? అనేది చెప్పగలమని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు తెలిపారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top