ఇద్దరినీ ఒకే చోట సమాధి చేయండి | Sakshi
Sakshi News home page

ఇద్దరినీ ఒకే చోట సమాధి చేయండి

Published Wed, Jun 26 2019 7:49 AM

Love Couple Suicide Attempt in Chaitanyapuri Hyderabad - Sakshi

చైతన్యపురి: పెద్దలు తమ పెళ్లికి అంగీకరించకపోవచ్చుననే భయంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన చైతన్యపురి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని వికాస్‌ నగర్‌లో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ సుదర్శన్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.నల్గొండ జిల్లా, పీయేపల్లి మండలం, రంగారెడ్డి గూడెం గ్రామానికి చెందిన  తిప్పన కుమారుడు సందీప్‌రెడ్డి ఎం–ఫార్మసీ పూర్తి చేశాడు.  మూడు నెలల క్రితం హైదరాబాద్‌ వచ్చిన అతను వికాస్‌నగర్‌లో గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. అతను తన బంధువు దామరచర్లకు చెందిన గజ్జల రామాంజరెడ్డి కుమార్తె త్రివేణి(19)ని ప్రేమిస్తున్నాడు. సోమవారం రాత్రి ఇద్దరు కలిసి కూల్‌డ్రింక్‌లో పురుగుమందు కలుపుకుని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

ఆపస్మారక స్థితిలో ఉన్న వారిని గుర్తించిన స్థానికులు బంధువులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అతడి బంధువులు సందీప్‌ను దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ  ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. త్రివేణి మలక్‌పేట్‌ యశోధా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు సూసైట్‌ నోట్‌ ను స్వాధీనం చేసుకున్నారు. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించరేమోననే అనుమానంతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉండవచ్చునని భావిస్తున్నారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నల్గొండ జిల్లా దామరచర్లకు చెందిన గజ్జల రామాంజరెడ్డి లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ హస్తినాపురం వెంకటరమణ కాలనీలో ఉంటున్నారు. అతని కుమార్తె త్రివేణి దిల్‌సుఖ్‌నగర్‌లోని ఐడిఎల్‌ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. 

త్రివేణి పరిస్థితి విషమం
త్రివేణి ప్రస్తుతం మలక్‌పేట యశోధ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని,  వెంటిలేర్‌పై చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. 

ఒకే చోట సమాధి చేయండి
‘‘తాము ఇద్దరం జీవితాన్ని చాలిస్తున్నామని, అమ్మ, నాన్నలు గొడవలు పడకండి....తమ ఇద్దరి సమాధులు పక్కపక్కనే ఏర్పాటు చేయండి’  అని నోట్‌లో పేర్కొన్నారు.

ప్రేమ విషయం తెలియదు
సందీప్‌రెడ్డి, త్రివేణి ప్రేమించుకుంటున్న విషయం తమకు తెలియదని ఇరు కుటుంబాల సభ్యులు తెలిపారు.ఈ విషయం తమ దృష్టికి వస్తే పెళ్లికి అంగీకరించేవారమన్నారు. సందీప్‌ మూడు నెలల క్రితం ముంబైలో ఓ కంపెనీలో ఉద్యోగం వచ్చిందని చెప్పి వెళ్లాడని అక్కడే ఉంటున్నట్లు భావించామని  సందీప్‌ రెడ్డి తండ్రి రాంరెడ్డి తెలిపారు. ముంబై నుంచే ఫోన్‌ చేస్తున్నట్లు మాట్లాడే వాడని, హైదరాబాద్‌లో ఉంటున్నట్లు తమకు తెలియదని ఆయన పేర్కొన్నారు.

Advertisement
Advertisement