లారీ డ్రైవర్‌ సజీవ దహనం

Lorry Driver Died in Fire Accident - Sakshi

దూబచర్ల వద్ద దుర్ఘటన రెండు లారీలు ఢీకొన్న వైనం

పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల (నల్లజర్ల): రాష్ట్రీయ రహదారిపై ఎదురెదురుగా రెండు లారీలు ఢీకొన్న ఘటనలో డ్రైవర్‌ సజీవదహనమయ్యాడు. నల్లజర్ల మండలం దూబచర్లలో సోమవారం వేకువజామున ఈ ఘటన చోటుచేసుకుది. స్థానికుల కథనం ప్రకారం.. నిడదవోలు మండలం సమిశ్రగూడెంకు చెందిన డ్రైవర్‌ సవరపు హరీష్‌ (25) టిప్పర్‌ లారీలో చిప్స్‌ లోడు వేసుకుని గౌరీపట్నం నుంచి గుండుగొలను వైపునకు వెళుతున్నాడు. ఈ క్రమంలోనే గుజరాత్‌ నుంచి టైల్స్‌ లోడుతో వస్తున్న లారీ హరీష్‌ లారీని ఢీకొట్టింది. దీంతో చిప్స్‌ లోడు లారీ డీజిల్‌ ట్యాంకర్‌ పగిలి మంటలు చెలరేగాయి. రెప్పపాటులో లారీ అగ్నికి ఆహుతైంది. లారీ క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన హరీష్‌ సజీవదహనమయ్యాడు. టైల్స్‌ లారీ డ్రైవర్‌ మాత్రం వాహనంలోంచి బయటకు దూకి ప్రా ణాలను దక్కించుకున్నాడు. సంఘటనా స్థలాన్ని నల్లజర్ల పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. 

సమిశ్రగూడెంలో విషాద ఛాయలు
నిడదవోలు రూరల్‌: నిడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామ వైఎస్సార్‌ సీపీ బూత్‌ కన్వీనర్‌ సవరపు హరీష్‌ (25) అకాల మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. హరీష్‌ లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. అతనికి భార్య సౌందర్యతో పాటు రెండేళ్ల కుమారుడు, ఏడాది కుమార్తె ఉన్నారు. ఘటనా స్థలంలో హరీష్‌ మృతదేహన్ని చూసి కుటుంబసభ్యులు, బం«ధుమిత్రులు గుండెలవిసేలా రోధించారు.

వైఎస్సార్‌ సీపీ శ్రేణులు సంతాపం
హరీష్‌ మరణవార్త తెలుసుకుని వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త జి.శ్రీనివాసనాయుడు, మాజీ ఎమ్మెల్యే జీఎస్‌ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. యువకుడైన హరీష్‌ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడని అతని మృతి పార్టీకి, కుటుంబసభ్యులకు తీరని లోటని పేర్కొన్నారు. వైఎస్సార్‌ సీపీ మండల అధ్యక్షుడు అయినీడి పల్లారావు, నియోజకవర్గ బూత్‌ కమిటీ కన్వీనర్‌ గాజుల రంగారావు, సొసైటీ అధ్యక్షుడు గజ్జరపు శ్రీరమేష్, ఎంపీపీ మన్యం సూర్యనారాయణ, రాష్ట్ర నాయకులు ముళ్లపూడి శ్రీనివాసకుమార్‌చౌదరి తదితరులు సంతాపం తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top