
సాక్షి, చెన్నై: ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా మూడో పెళ్లికి సిద్ధమయ్యాడు ఆ నిత్యపెళ్లి కొడుకు. అయితే దురదృష్టం కొద్ది ఇద్దరు భార్యల చేతికి చిక్కాడు. చితక్కొట్టుడుకు గురైనాడు. వివరాలు. కోయంబత్తూరు జల్లా సూలూరు నెహ్రూనగర్‌కు చెందిన సౌందరరాజన్ కుమారుడు అరంగ అరవింద్ దినేష్ (26). ఇతను రాశీపాలయంలోని ఒక ప్రయివేటు సంస్థలో ప్యాట్రన్‌మేకర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి తిరుప్పూరు గణపతిపాళయం చెందిన ప్రియదర్శిని అనే యువతితో 2016లో వివాహమైంది. పెళ్లయిన 15 రోజుల్లోనే వేధింపులకు గురిచేయడంతో కొన్నాళ్లపాటూ భరించిన ప్రియదర్శిని ఆ తరువాత తన పుట్టింటికి వెళ్లిపోయింది. తనకు పెళ్లయి మొదటి భార్య ఉన్న విషయాన్ని దాచిపెట్టి కల్యాణ వేదిక వెబ్‌సైట్ల ద్వారా వధువు వేట మొదలెట్టి కరూరు జిల్లా పశుపతి పాళయంకు చెందిన అనుప్రియ (23)ను ఈఏడాది ఏప్రిల్ 10వ తేదీన వివాహమాడాడు. అనుప్రియకు గతంలో పెళ్లయి రెండేళ్ల కుమారుడు కూడా ఉన్నాడని తెలిసే అతడు పెళ్లిచేసుకున్నాడు.
మొదటి భార్యతో ప్రవర్తించినట్లుగానే రెండో భార్యను సైతం వేధింపులకు గురిచేయడంతో ఆమె కూడా పుట్టింటికి వెళ్లిపోయింది. ఇదిలా ఉండగా మూడోపెళ్లికి సిద్దమైన ఈ నిత్యపెళి్లకొడుకు దినేష్ మరలా వివాహ వెబ్‌సైట్‌లను వెతకడం ప్రారంభించాడు. ఈ సమాచారం అందుకున్న మొదటి భార్య ప్రియదర్శిని, రెండో భార్య అనుప్రియ మంగళవారం ఉదయం కోయంబత్తూరు జిల్లా సూలూరులోని అతని తండ్రి ఇంటి వద్దకు చేరుకున్నారు. తండ్రి సౌందరరాజన్‌ను వెంటపెట్టుకుని దినేష పనిచేసే సంస్థ వద్ద ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న సూలూరు పోలీసులు దినేష్, ఇద్దరు భార్యలను పోలీసు స్టేషన్‌కు రావాలి్సందిగా చెప్పి వెళ్లిపోయారు. ఈ సమయంలో సంస్థ నుంచి బయటకు వచ్చిన దినేష్‌ను ఇద్దరు భార్యలు చుట్టుముట్టి చితకబాదారు. ఇద్దరు పెళ్లాలు, ముద్దుల మొగుడు వ్యవహారం పోలీసు స్టేషన్‌కు చేరుకుంది.