కార్తీక్‌ హత్య కేసు విచారణ వేగవంతం

Kartik Murder Case: Police Investigation Speeding Up - Sakshi

కోర్టు అనుమతితో నిందితులను కస్టడీలోకి..

హత్యకు ప్రేరేపించిన వ్యక్తులపై పోలీసుల ఆరా

అజయ్‌ పాత్రపై విచారణ? 

సాక్షి, గద్వాల : జిల్లాలో సంచలనం సృష్టించిన కార్తీక్‌ హత్య.. మరో వివాహిత ఆత్మహత్య కేసు విచారణ వేగవంతమైంది. ఫిబ్రవరి 24న కార్తీక్‌ దారుణహత్య.. 27న వివాహిత ఆత్మహత్య ఈ రెండు ఘటనలకు కారణం వివాహేతర సంబంధంగా పోలీసులు తేల్చి చెప్పారు. అయితే కార్తీక్‌ హత్య కేసులో రిమాండ్‌కు వెళ్లిన నిందితులను గద్వాల పోలీసులు కోర్టు అనుమతితో అదుపులోకి తీసుకున్నారు. ఈమేరకు విచారణ అధికారి, శాంతినగర్‌ సీఐ వెంకటేశ్వర్లు, పట్టణ ఎస్‌ఐ సత్యానారాయణ విచారణ చేపట్టారు. కార్తీక్‌ హత్యకు గల కారణాలు ఏంటనే దానిపై విచారణ చేపట్టినట్లు విశ్వసనీయ సమాచారం. తనను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడని, ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని వివాహిత.. ఏ1 రవికుమార్‌కు చెప్పిందా? లేక అతనితో ఎందుకు చనువుగా ఉంటున్నావు అంటూ వివాహితను రవికుమార్‌ నిలదీయడం.. తదితర కారణాలు హత్యకు ప్రేరేపించాయా అన్నదానిపై విచారించినట్లు సమాచారం. ఈ అంశాలపై నిందితులైన ఏ1 రవికుమార్‌ అలియాస్‌ దొంగరవి, ఏ2 వసంత్, ఏ3 అనిల్, ఏ4 వీరేష్‌, ఏ5 సునీల్‌ను విచారించారించినట్లు తెలిసింది.  

నిర్మానుష్య స్థలంలో పూడ్చమని చెప్పిందెవరు? 
కార్తీక్‌ హత్యకు ముందు ఎవరెవరు ఎవరితో మాట్లాడారు, హత్య చేసిన క్రమంలో మృతదేహాన్ని నిర్మానుష్య స్థలంలో పూడ్చమని చెప్పిందెవరు అనే విషయాలపై విచారణ చేసినట్లు సమాచారం. కార్తీక్‌ కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదుపై పెద్దపల్లి అజయ్‌కు మీకు (నిందితుల)కు సంబంధం ఏంటని ఆరా తీస్తున్నట్లు సమాచారం. గతంలోను రవికుమార్, పెద్దపల్లి అజయ్‌ మరికొంత మంది కార్తీక్‌ ఇంటికి వెళ్లి భయభ్రాంతులకు గురి చేశారనే అంశాలపై విచారించినట్లు తెలిసింది.   

మహబూబ్‌నగర్‌లోనూ విచారణ 
ఇదిలాఉండగా, హత్యకు ముందు కార్తీక్‌ను నిందితులు మహబూబ్‌నగర్‌లోని ఓ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో కలిసిన విషయం విధితమే. మనం మనం మాట్లాడుకుందాం అంటూ.. కార్తీక్‌ను కారులో ఎక్కించుకొని గద్వాల పరిసరాలకు వచ్చాక హత్య చేసి పూడ్చి పెట్టారు. ఈమేరకు కేసు విషయంలో బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ నిర్వాహకులను కలిసి ఆ రోజు మద్యం తాగేందుకు ఎంత మంది వచ్చారు, ఘర్షణ పడ్డారా అనే విషయమై వివరాలు రాబట్టారు. కార్తీక్‌ గ్రూప్‌లో నలుగురు, రవికుమార్‌ గ్రూప్‌లో నలుగురు మొత్తం 8 మంది అక్కడకు వచ్చరాని నిర్వాహకులు సమాధానం చెప్పినట్లు సమాచారం. దాడి చేసింది, సహకరించింది ఎవరెవరు అనే దానిపై పోలీసులు క్షుణ్ణంగా విచారణ చేస్తున్నారు.  

త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తాం 
కార్తీక్‌ హత్య కేసుకు సంబంధిచిన విషయంలో కోర్టు అనుమతి మేరకు గురువారం రాత్రి ఐదుగురు నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించాం. కేసులోని పలు విషయాల నివృత్తి కోసం కస్టడీలోకి తీసుకున్నాం. అజయ్‌ ప్రాత్రపై ఇంకా తెలియాల్సి ఉంది. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తాం. ఐదుగురు నిందితులను శుక్రవారం సాయంత్రం గద్వాల కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించాం. మహబూబ్‌నగర్‌లోని బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ నిర్వాహకుల నుంచి సైతం వివరాలు రాబట్టాం.  
– వెంకటేశ్వర్లు, సీఐ, శాంతినగర్‌

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top