నిశా'చోరులు': ఆలయాలే టార్గెట్‌

Kamareddy Police Arrested Thieves Who Targets On Temple Hundies - Sakshi

దొంగతనాలే వృత్తి.. మూడు జిల్లాల్లో 18 కేసులు.. 

వాహనాల తనిఖీలో చిక్కిన నిందితులు 

రూ. 1.02 లక్షల సొత్తు రికవరీ 

వివరాలు వెల్లడించిన ఎస్పీ శ్వేత

వారి వృత్తి చోరీలు.. ఆలయాలే టార్గెట్‌.. రాత్రి వేళల్లో జన సంచారం ఉండదు కాబట్టి ఆ సమయంలోనే దొంగతనాలకు పాల్పడుతుంటారు. ఇలా కామారెడ్డితోపాటు నిజామాబాద్, సిరిసిల్ల జిల్లాలలో పలు ఆలయాల్లో చోరీలకు పాల్పడ్డారు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు.

సాక్షి, కామారెడ్డి: రాత్రి వేళల్లో నిర్మానుష్యంగా ఉన్న ఆలయాలను టార్గెట్‌ చేస్తూ మూడు జిల్లాల పరిధిలో 18 చోరీలకు పాల్పడిన ఇద్దరు నిందితులను కామారెడ్డి పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్పీ శ్వేత శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు తెలిపారు. మాచారెడ్డి మండలం నడిమి తండాకు చెందిన భూక్యా దరి, భూక్యా గణేశ్‌ ఆలయాల్లో చోరీలు చేయడా న్ని వృత్తిగా ఎంచుకున్నారు. ఆలయాల్లో రాత్రి సమయంలో ఎవరూ ఉండరు కాబట్టి సులువుగా దొంగతనాలు చేయవచ్చన్నది వీరి ఉద్దేశం. ఆలయాల తాళాలు పగులగొట్టి, హుండీలు, వస్తువులు ఎత్తుకెళ్లేవారు. ఆభరణాలను అమ్ముకుని అవసరాలకు ఖర్చు చేస్తున్నారు. వీరు నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల పరిధిలో 18 ఆలయాల్లో చోరీలు చేశారు. గురువారం రామారెడ్డి ఎస్సై రాజు పోలీసులతో కలిసి గొల్లపల్లి వద్ద వాహనాలను తనిఖీలు చేస్తుండగా.. బైక్‌పై వచ్చిన వీరిద్దరు పారిపోవడానికి ప్రయత్నించారు. పోలీసులు పట్టుకుని విచారించగా.. చోరీల డొంక కదిలింది.  

నేరాల చిట్టా.. 
గణేశ్, దరిలపై పలు పోలీస్‌ స్టేషన్‌లలో కేసులున్నాయి. కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 4, దేవునిపల్లి పీఎస్‌ పరిధిలో 3, మాచారెడ్డి, దోమకొండ, రాజంపేట పీఎస్‌ల పరిధిలో ఒక్కో చోరీ కేసు నమోదై ఉంది. నిజామాబాద్‌ జిల్లాలోని ధర్పల్లి, సిరికొండ పీఎస్‌ల పరిధిలో ఒక్కొక్కటి, సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట పరిధిలో 3, ఎల్లారెడ్డిపేట పరిధిలో 2, వీర్నపల్లి ఠాణా పరిధిలో ఒకటి చొప్పున కేసులున్నాయి. ఆయా ఆలయాల్లో హుండీలోని నగదు, ఆభరణాలతోపాటు యాంప్లిఫయర్‌ పరికరాలను ఎత్తుకెళ్లారు. మొత్తం 18 కేసుల్లో రూ. లక్షా 63 వేల సొత్తును అపహరించారు. నిందితులను పట్టుకుని లక్షా 2 వేల విలువైన 11 యాంప్లిఫయర్‌లు, ఇతర వస్తువులను రికవరీ చేసినట్లు ఎస్పీ తెలిపారు.  

సీసీ కెమెరాలుంటాయని తెలిసినా...  
ఆలయాల్లో సీసీ కెమెరాలు ఉంటాయని తెలిసినా నిందితులు దొంగతనాలకు పాల్పడేవారని ఎస్పీ తెలిపారు. చాలా చోట్ల సీసీ కెమెరాల ఆధారంగానే నిందితులను గుర్తించామన్నారు. కొన్ని సందర్భాల్లో ఆలయాల్లోని సీసీ కెమెరాలను పనిచేయకుండా చేసేందుకు సైతం ప్రయత్నించారన్నారు. చివరికి సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగానే నేరాల చిట్టా బయటపడిందన్నారు. కామారెడ్డి, మాచారెడ్డి, రామారెడ్డి పోలీస్‌స్టేషన్ల పరిధిలో సీసీ కెమెరాలను అత్యధికంగా ఏర్పాటు చేసే విధంగా కృషి చేసిన పోలీసు అధికారులను అభినందించారు. 18 ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడిన నిందితులను పట్టుకోవడానికి కృషి చేసిన రామారెడ్డి పోలీస్‌ కానిస్టేబుళ్లు బాబయ్య, కృష్ణలకు నగదు పురస్కారాలను అందజేశారు. కేసు ఛేదనలో కృషి చేసిన డీఎస్పీ లక్ష్మీనారాయణ, రూరల్‌ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, రామారెడ్డి ఎస్సై కే.రాజు, కానిస్టేబుళ్లు నరేష్, భూమయ్య, రంజిత్, హోంగార్డు నర్సింలులను అభినందించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top