కరుడుగట్టిన నేరస్తుడి అరెస్ట్‌ | Sakshi
Sakshi News home page

కరుడుగట్టిన నేరస్తుడి అరెస్ట్‌

Published Wed, Jun 17 2020 1:27 PM

Kamareddy Police Arrest Old Offender in 16 Cases - Sakshi

కామారెడ్డి క్రైం: ఎంతోకాలంగా తప్పించుకు తిరుగుతున్న ఓ కరుడుగట్టిన నేరస్తుడిని కామారెడ్డి పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పర్చినట్లు ఎస్పీ శ్వేత ఒక ప్రకటనలో వెల్లడించారు. ఎస్పీ కథనం ప్రకారం వివరాలు.. మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా ఆర్ధాపూర్‌ తాలుకాలోని నుండుక గ్రామానికి చెందిన మిత్కారి లక్ష్మణ్‌ మరో ఆరుగురితో కలిసి బందిపోటు, దోపీడీలు, రాత్రిపూట దొంగతనాలకు పాల్పడేవాడు. ఇతనిపై కామారెడ్డి, సంగారెడ్డి, జోగులంబ గద్వాల, మెదక్, నాందేడ్‌ జిల్లాల్లో 16 కేసులు నమోదై ఉన్నాయి. ఈ ముఠాను పట్టుకునేందుకు కామారెడ్డి పోలీసులు ఎంతోకాలంగా గాలింపు చేపడుతున్నారు. గతేడాది మే నెలలో ఈ ముఠాలోని లక్ష్మణ్‌తో పాటు వ్యాపన్‌వాడ్‌ శంకర్, దండుగుల బాబులపై పీడీయాక్ట్‌ నమోదుకు కామారెడ్డి కలెక్టర్‌కు జిల్లా పోలీసుశాఖ సిఫారసు చేసింది. కలెక్టర్‌ ఆమోదంతో ముగ్గురిపై పీడీయాక్ట్‌ నమోదు అయింది.

శంకర్, బాబులతో పాటు మిగిలిన ముఠా సభ్యులను గతంలోనే అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపారు. లక్ష్మణ్‌ మాత్రం ఇంతకాలం పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. పక్కా సమాచారం మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలో లక్ష్మణ్‌ను అరెస్ట్‌ చేసి కోర్టుకు హాజరుపర్చారు. ఆ తర్వాత వెంటనే అతడిని నిజామాబాద్‌ జైలుకు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. నేరస్తుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన కామారెడ్డి ఎస్‌హెచ్‌వో జగదీష్, సీసీఎస్‌ సీఐ అభిలాష్, ఎస్సై శేఖర్, హెడ్‌కానిస్టేబుల్‌ నర్సింలు, కానిస్టేబుళ్లు ముకేష్, శ్రావణ్‌ను ఎస్పీ అభినందించారు. 

Advertisement
Advertisement