విద్యార్థిని అనుమానాస్పద మృతి

Inter Student Suspicious Deceased in Hyderabad - Sakshi

చిలకలగూడ: అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతి చెందిన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... రైల్వే ఉద్యోగి గట్టు లక్ష్మీనారాయణ చిలకలగూడ రైల్వే క్వార్టర్స్‌లో కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నాడు. కొంతమేర శిథిలమైన మూడు అంతస్థుల భవనంలో లక్ష్మీనారాయణ కుటుంబం మాత్రమే ఉంటోంది. అతని కుమార్తె మయూరి(18) స్థానిక రైల్వే కళాశాలలో ద్వితీయ ఇంటర్‌ చదువుతోంది. కొంతకాలంగా ఎవరితోనో ఎక్కువ సమయం ఫోన్‌లో మాట్లాడుతున్న తన కుమార్తె, ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5.30 గంటల నుంచి కనిపించడం లేదని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిందని భావిస్తున్న రోజు రాత్రి 9.30 గంటలకు ఆమె ఫోన్‌ ఎంగేజ్‌ వచ్చిందని, కొంత సమయం తర్వాత మరోసారి కాల్‌ చేస్తే నాట్‌ రీచబుల్‌ వచ్చిందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 7.30 గంటలకు లక్ష్మీనారాయణ ఉంటున్న భవనం సమీపంలో ఓ యువతి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, ఆ మృతదేహం మయూరిదేనని వారు గుర్తించారు. భవనం టెర్రస్‌ పైన పిట్టగోడ కేవలం మూడు అడుగులు మాత్రమే ఉందని, ఫోన్‌ మాట్లాడుతూ ఆమె ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెంది ఉంటుందని ప్రాథమిక దర్యాప్తులో తేలినప్పటికీ.., మృతురాలి చెప్పులు టెర్రస్‌పైనే ఉండటం, మృత దేహానికి కొద్ది దూరంలో పగిలిపోయిన సెల్‌ఫోన్‌ పడి ఉండటం పలు అనుమానాలకు తావిస్తున్నది. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి దర్యాప్తు చేపట్టామని చిలకలగూడ ఇన్‌స్పెక్టర్‌ బాలగంగిరెడ్డి తెలిపారు. విద్యార్థిని మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు.   

యువతి అదృశ్యం
చాంద్రాయణగుట్ట: కిరాణ దుకాణానికి వెళుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన ఓ యువతి కనిపించకుండా పోయిన సంఘటన ఛత్రినాక పీఎస్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ మోజీరాం సమాచారం మేరకు... లక్ష్మీనగర్‌కి చెందిన వీరస్వామి కుమార్తె శ్వేత(22) ఈ నెల 28న ఉదయం స్థానికంగా ఉన్న కిరాణ దుకాణానికి వెళుతున్నానని చెప్పి వెళ్లింది. తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పలు ప్రాంతాలలో వెతికినా ప్రయోజనం లేదు. ఈ విషయమై శ్వేత పెద్దమ్మ కల్పన పోలీసులకు ఫిర్యాదు చేసింది.  ఆచూకీ తెలిసిన వారు ఫోన్‌: 94906 16500లో సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top