అయ్యో ఏమిటీ ఘోరం.. | Infant Deaths Increasing In Agency Areas In East Godavari | Sakshi
Sakshi News home page

అయ్యో ఏమిటీ ఘోరం..

Aug 22 2019 6:34 AM | Updated on Aug 22 2019 6:34 AM

Infant Deaths Increasing In Agency Areas In East Godavari - Sakshi

తల్లిని కాబోతున్న ఆ ఆలోచనే ఆనందం పిండం నాటి నుంచే ఎన్నెన్నో ఆలోచనలు మొదటి నెల నుంచే బిడ్డ రూపం కోసం ఊసులు  నెలలు దాటుతున్న కొద్దీ పారవశ్యం ఉమ్మ నీటిలో తిరగాడుతూ లేలేత పాదాల స్పర్శతో పలకరింత ఆ అనుభూతులతో ఆ అమ్మ పులకరింత దగ్గరకొస్తున్న రోజులను లెక్కించుకుంటూ పురిటి నొప్పులు మరో జన్మని తెలిసినా ప్రాణత్యాగానికైనా సిద్ధమంటూ ఆ పసికందు ‘కేక’ కోసం కన్నార్పకుండా  ఎదురు చూసే ఆ అమ్మకు ఎంత కష్టం పురిట్లోనే ఆ పసిగుడ్డుకు మృత్యువు కాటేస్తే ఎంత గర్భ శోకం వారేం చేశారు పాపం  మన్యంలో ఇది ఓ శాపం మన్యంలో మృత్యువు వికటాట్టహాసం చేస్తోంది. ఏదో రూపంలో గిరిజనులను కాటేస్తోంది. వైద్య సేవలు అంతంతమాత్రంగా లభ్యమవుతుండడంతో ఈ దుస్థితి నెలకొంది.

సాక్షి, రంపచోడవరం(తూ.గో) : ఏజెన్సీలో శిశు మరణాలు అంతులేని విషాదాన్ని నింపుతున్నాయి. కొద్దిపాటి అనారోగ్యంతో కూడా పసిపిల్లలు ప్రాణాలు కోల్పోతుంటే తల్లులకు గర్భశోకం మిగులుతోంది. వైద్యశాస్త్రం కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో కూడా మన్యంలో శిశువుల ప్రాణాలు నిలిపేందుకు అధునిక వైద్యం అక్కరకు రావడం లేదు. ఆసుపత్రులున్నా నిపుణులైన వైద్యులు లేని పరిస్ధితి, వైద్యులున్నా రోగులకు అందుబాటులో లేని దుస్థితి ఆదివాసీలకు ఆవేదన మిగుల్చుతోంది. వర్షాకాలంతోపా టు వచ్చే రోగాలు ఏజెన్సీ మారుమూల ప్రాంతాల్లో నివశిస్తున్న ఆది వాసీలకు ప్రాణాపాయం కలిగిస్తున్నాయి.

గత టీడీపీ పాలకులు ఏజెన్సీలో గిరిజన సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు. ఫలితంగా ఐదేళ్ల కాలంలో అనేక మంది పసిపిల్లలు ప్రాణాలు గాలిలో కలిసిపోయినా సరైన చర్యలు తీసుకోకపోవడంతో అదే విషాదం కొనసాగుతోంది. తాజాగా వై రామవరం మండలం పి. ఎర్రగొండ గ్రామానికి చెందిన పి. మోహన్‌రెడ్డి, వెంకయమ్మ దంపతుల మూడు నెలల బాలుడు అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ నెల 15వ తేదీన వై.రామవరం ఏరియా ఆసుపత్రికి జ్వరంతో ఉన్న బాలుడిని తీసుకువెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని మందులు లేవని చెప్పడంతో ఏలేశ్వరం ప్రైవేట్‌ ఆసుపత్రికి, అక్కడి నుంచి కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా బుధవారం బాలుడు మృత్యువాత పడ్డాడు. ఈ నెలలోనే  లాగరాయి, ముంజవరప్పాడు ›గ్రామాల్లో ఇద్దరు శిశువులు అనారోగ్యంతో చనిపోయారు.

నాలుగు నెలలు కాలంలో ఏడుగురు పిల్లలు మృత్యువాత
ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జూలై నాటికి ఏజెన్సీలో ఏడుగురు పిల్లలు అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయారు. 2016 ఏప్రిల్‌ నుంచి 17 మార్చి వరకు 239 మంది పిల్లలు అసువులుబాసారు. 2017 ఏప్రిల్‌ నుంచి 2018 మార్చి 124 శిశు మరణాలు సంభవించాయి. 2018 ఏప్రిల్‌ నుంచి 2019 మార్చి వరకు 67 శిశు మరణాలు నమోదుకాగా 2019 ఏప్రిల్‌ నుంచి జూలై వరకు ఏడు శిశు మరణాలు నమోదయ్యాయి.

అందుబాటులో లేని వైద్య సేవలు:
ఏజెన్సీలో గైనిక్‌ వైద్య సేవలతోపాటు చిన్న పిల్లల వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో గిరిజనులకు శాపంగా మారింది. అనారోగ్యంతో ఉన్న పిల్లలను పీహెచ్‌సీలకు తీసుకువచ్చినా అక్కడ సరైన వైద్య సేవలు అందడం లేదు. అక్కడి నుంచి కాకినాడ జీజీహెచ్‌కు తరలిస్తున్నా ఊపిరి నిలవడం లేదు. పీహెచ్‌సీ స్ధాయిలో ప్రత్యేక వైద్య నిపుణులు అందుబాటులో ఉంటేనే మెరుగైన వైద్యం అందే పరిస్ధితి ఉందని ఈ ప్రాంతవాసులు చెబుతున్నారు. ఏజెన్సీలో 24 పీహెచ్‌సీలకూ ఒకే విధంగా వైద్యుల పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది.

గర్భిణిలో పోషకాహారం లోపం పుట్టబోయే బిడ్డపై పడుతోంది. ఫలితంగా రోగనిరోధక శక్తి లేకపోవడంతో చిన్నపాటి అనారోగ్యంతో కోలుకోలేని పరిస్ధితిని తల్లీ, పిల్లలు ఎదుర్కొంటున్నారు. రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో ‘నేషనల్‌ రూరల్‌ హెల్త్‌ మిషన్‌’ నిధులతో ఏర్పాటు చేసిన నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో పీడియాట్రిక్‌ (చిన్న పిల్లల వైద్యుడు) పోస్టు ఖాళీగా ఉంది. ఏజెన్సీలో ఏకైక కేంద్రంలో వైద్యుడు లేకపోవడంతో మృత్యుహేలలు ఎక్కడో ఓ దగ్గర వినిపిస్తూనే ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement