అల్లూరి జిల్లా దార్రెల పంచాయతీలో వరుస ఘటనలు
చిన్నారుల్లో శ్వాస సంబంధిత సమస్యలు
పుట్టిన కొద్ది నెలలకే పసికందుల మరణాలపై తల్లిదండ్రుల ఆవేదన
ముంచంగిపుట్టు: అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం దార్రెల పంచాయతీలో వరుస శిశు మరణాలు కలకలం రేపుతున్నాయి. నెలరోజుల వ్యవధిలో ఐదుగురు పసికందులు అంతుచిక్కని కారణాలతో చనిపోయారు. దీంతో గిరిజనులు భయాందోళన చెందుతున్నారు. డి.కుమ్మరిపుట్టు గ్రామానికి చెందిన 4 నెలల చిన్నారి హర్షశ్రీ శనివారం మృతి చెందాడు. మూడ్రోజుల నుంచి పాలు తాగకపోవడంతో నీరసించిపోయాడు. దీంతో తల్లిదండ్రులు శుక్రవారం స్థానిక సీహెచ్‌సీకి తీసుకెళ్లారు.
అక్కడి వైద్యులు పాడేరులోని జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం 7 గంటలకు మృతిచెందినట్టు తల్లిదండ్రులు శ్రీకాంత్, రాజేశ్వరి తెలిపారు. ఇదే గ్రామానికి చెందిన లలితశ్రీ అనే 4 నెలల చిన్నారి కూడా ఈ నెల 11న మృతి చెందింది. అలాగే, చీవుకుచింతలో ఈ నెల 13న రెండు నెలల బాబు.. తలింబ గ్రామంలో ఈ నెల 5న రెండునెలల పాప మృతి చెందగా, ఇదే గ్రామానికి చెందిన నెల రోజుల బాబు గత నెల 29న మృతిచెందాడు.
శ్వాస సంబంధిత సమస్యలతోనే..
అరోగ్యంగా ఉండే చిన్నారులు ఇలా ఉన్నట్టుండి శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ పాలు తాగడం మానేస్తున్నారు. పాడేరు జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న సమయంలో మృతి చెందారు. పుట్టిన కొద్దినెలలకే చిన్నారులు ఇలా మృతి చెందుతుండడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
వైద్యారోగ్యశాఖ అధికారులు స్పందించి చిన్నారుల మృతికిగల కారణాలు తెలుసుకుని, తదుపరి చర్యలు చేపట్టాలని సర్పంచ్ పాండు, ఆయా గ్రామాల గిరిజనులు కోరారు. ఇదిలా ఉంటే.. చిన్నారుల్లో ఇన్‌ఫెక్షన్ వల్లగానీ, లేదా మెదడు సంబంధిత సమస్యలు ఉన్నప్పుడుగానీ ఇలాంటివి జరుగుతాయని వైద్యులు చెబుతున్నారు.


