
మాట్లాడుతున్న వెంకటరమణ
సాక్షి, నరసన్నపేట(శ్రీకాకుళం) : నిబంధనలకు విరుద్ధంగా పట్టు వస్త్రాలను తరలిస్తున్న కోల్‌కతాకు చెందిన ఆషిఫ్ పటోలా ఆర్ట్స్ అనే వ్యాపారి నుంచి రూ. 25,86,112 లను పన్ను, జరిమానా, ఫైన్‌ల కింద కట్టించినట్లు నరసన్నపేట డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ కింజరాపు వెంకటరమణ తెలిపారు. వాహన తనిఖీల్లో ఇంత పెద్ద మొత్తంలో ఒక వ్యాపారి నుంచి ఫైన్ కట్టించడం చాలా అరుదన్నారు. ఈ కేసును సవాల్‌గా తీసుకుని విచారించి చివరికి వ్యాపారి నుంచి ఈ మొత్తాన్ని కట్టించి ప్రభుత్వ ఆదాయం పెంచినట్లు తెలిపారు. బుధవారం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కేసు వివరాలను వెల్లడించారు. నరసన్నపేటకు చెందిన జీఎస్‌టీఓ ఎన్.తిరుపతి బాబు, ఇన్‌స్పెక్టర్ బి.ఉపేంద్రరావు తదితరులు మడపాం టోల్ గేట్ వద్ద ఈ నెల 20వ తేదీ సాయంత్రం తనిఖీలు చేపట్టారన్నారు.
ఆ సమయంలో కొల్‌కతా నుంచి విజయవాడకు వెళ్తున్న క్వాలీస్ వాహనంపై అనుమానంతో నిలిపి తనిఖీలు చేస్తుండగా ఎగ్జిబిషన్ సేల్స్ కోసం తరలిస్తున్న పట్టు వస్త్రాలను గమనించారన్నారు. పూర్తిగా ఆరా తీయగా అవి నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్నట్లు గుర్తించారన్నారు. సుమారు రెండు కోట్లు విలువైన 1080 పట్టు చీరలు రూ.12.50 లక్షలకు బిల్లులు చూపించి రవాణా చేసినట్లు తెలిపారు. వారం రోజుల పాటు ఈ కేసుపై వాదనలు నిర్వహించిన అనంతరం అసిస్టెంట్ కమిషనర్ సి.హెచ్.కొండమ్మ ఆదేశాల మేరకు కోలకతాలో ఉన్న వస్త్ర వ్యాపారిని రప్పించామన్నారు. ఆయన వద్ద నుంచి రూ. 25,86,112లను కట్టించినట్లు తెలిపారు.