ఇథియోపియాలో నగరవాసి మృతి! 

Hyderabad resident Killed in Ethiopia - Sakshi

ప్రయాణిస్తున్న కారును అడ్డుకుని సజీవదహనం చేసిన దుండగులు 

అధికారికంగా ఎటువంటి సమాచారం లేదన్న స్నేహితులు 

హైదరాబాద్‌: తూర్పు ఆఫ్రికా దేశమైన ఇథియోపియాలో కారులో ప్రయాణిస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఓ ఔత్సాహిక పారిశ్రామికవేత్తను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సజీవదహనం చేశారు. ఈ ఘటనలో నగరవాసి మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుడు ముషీరాబాద్‌లోని అశోక్‌నగర్‌ వాసి టీవీ శశిధర్‌గా అక్కడి పోలీసులు తేల్చారు. సన్‌రైజ్‌ మైనింగ్‌ పీఎల్‌టీ పేరిట ఇథియోపియాలో మైనింగ్‌ వ్యాపార సంస్థను ప్రారంభించేందుకు రెండేళ్లుగా శశిధర్‌ ప్రయత్నిస్తున్నాడు.

ఈ క్రమంలో తరచూ అక్కడికి వెళ్లి వస్తున్నారు. ఈనెల 9న మళ్లీ అక్కడకు వెళ్లిన శశిధర్‌ ముగ్గురు ఇథియోపియా దేశస్తులతో పాటుగా జపాన్‌కు చెందిన మరో వ్యక్తితో కలసి మంగళవారం రెండు కార్లలో బయటకు బయల్దేరారు. శశిధర్‌ రెండో కారులో ప్రయాణిస్తుండగా మార్గమధ్యంలో కొందరు దుండగులు అడ్డగించి కారును దహనం చేసేశారు. అయితే ముందు బయల్దేరిన మొదటి కారులోని వ్యక్తులు శశిధర్‌ కారు ఇంకా రావటం లేదని గమనించి వెనుదిరిగి చూసేసరికి కారు తగలబడిపోతున్నట్లు కన్పించింది. దీంతో వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనలో శశిధర్‌ మృతి చెంది ఉండ వచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.  

శశిధర్‌ నివాసం వద్ద విషాద ఛాయలు 
శశిధర్‌ మృతితో అశోక్‌నగర్‌లోని స్ట్రీట్‌ నంబర్‌ 2లోని జీహెచ్‌ఎంసీ–56 ఇంటివద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. శశిధర్‌కు భార్య, కూతురు తేజస్విని, కొడుకు అభిషేక్‌ ఉన్నారు. శశిధర్‌ మరణ వార్తను తెలుసుకున్న ఇక్కడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. అయితే ఇథియోపియాలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించగా, ఆయన మృతికి సంబంధించి అధికారికంగా ఎటువంటి సమాచారం రాలేదని చెప్పారని కుటుంబసభ్యులు తెలిపారు. తరచూ తమతో మాట్లాడే శశిధర్‌ నుంచి గత రెండ్రోజులుగా ఎటువంటి సమాచారం లేదని, ఆయన ఫోన్‌ కూడా కలవలేదని శశిధర్‌ వ్యాపార భాగస్వామి రామకృష్ణ, శశిధర్‌కు చెందిన ఎగ్జిమ్‌ కంపెనీ మేనేజర్‌ సంతోష్‌ తెలిపారు. ఈ ఘటనలో శశిధర్‌ తప్పించుకుని ఉండాలని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top