పెట్రోలింగ్‌ వ్యాన్‌ వద్దకే మద్యం

Hyderabad Cops Buying Alcohol goes Viral - Sakshi

ఎస్సార్‌నగర్‌ పోలీసుల నిర్వాకం 

ఇన్‌స్పెక్టర్‌కు చార్జిమెమో 

సాక్షి, అమీర్‌పేట: మండుతున్న ఎండలతో పెట్రోలింగ్‌ విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులకు దప్పికేసినట్లుంది. ఇంత ఎండలో నీళ్లు తాగితే దాహం తీరదని భావించారో ఏమో.. ఏకంగా వైన్స్‌ షాపు వద్ద వాహనాన్ని ఆపివేశారు. పోలీస్‌ యూనిఫాంలో మద్యం షాపునకు వెళితే బాగుండదని  భావించి షాపు యజమానికి ఆర్డర్‌ వేశారు. ఎవరికీ అనుమానం రాకుండా  వైన్స్‌ షాపు సిబ్బంది నల్లటి బ్యాగులో మద్యం సీసాలను తీసుకొని వచ్చి  పెట్రో వాహనంలో ఉన్న పోలీసులకు ఇచ్చి వెళ్లిపోయాడు. ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మధురానగర్‌ సోని మెట్రోవైన్స్‌ నుంచి పోలీసులు డబ్బులు ఇవ్వకుండానే మద్యం తీసుకెళ్తుండడాన్ని గుర్తించిన కొందరు యువకులు దీనిని వీడియో రికార్డు చేశారు. సామాజిక మాద్యమంలో ఈ విషయం హల్‌చల్‌ చేయడంతో దర్యాప్తు చేపట్టిన ఉన్నతాధికారులు పెట్రో వ్యాన్‌లో ఉన్న కానిస్టేబుల్‌ సురేష్, హోంగార్డు చైతన్య మద్యం తీసుకుని వెళ్లినట్లు నిర్ధారించారు. ఈ విషయమై వారిని కోరేందుకు వెళ్లగా ఆ పెట్రో వాహనం  తమది కాదని బుకాయించారు. సీసీ కెమెరాలను పరిశీలించి వాహనాన్ని గుర్తిస్తామని చెప్పి చేతులు దులుపుకున్నారు. 

చార్జి మెమోజారీ 
పెట్రో వాహనంలో మద్యం బాటిళ్లు తీసుకెళ్లిన సంఘటనపై నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ ఇన్స్‌పెక్టర్‌ వహిదుద్దీన్‌కు సోమవారం చార్జి మెమో జారీ చేశారని పంజగుట్ట ఏసీపీ విజయ్‌కుమార్‌ తెలిపారు. వాహనంలో కానిస్టేబుల్‌ సురేష్, హోంగార్డు చైతన్య ఉన్నారని, చైతన్య మద్యం తెప్పించాడన్నారు. ఈ నెల 9న చైతన్య చెల్లి పెళ్లి ఉన్నందున ఒక ఫుల్‌ బాటిల్, మరో ఆఫ్‌ బాటిల్‌ కొనుగోలు చేసినట్లు విచారణలో తెలిందన్నారు. యునిఫాంలో ఉన్నందున వైన్స్‌షాపు సమీపంలోని తోపుడుబండి నిర్వాహకుడి ద్వారా మద్యం తెప్పించుకున్నట్లు తెలిపారు.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top