మొగుడే హంతకుడు..!

The Husband Who Murdered His Wife - Sakshi

వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ

వివాహేతర సంబంధాలపై నిలదీస్తోందని కడతేర్చాడు

తహశీన్‌ హత్య కేసులో భర్త అంజాద్‌ను అరెస్టుచేసిన పోలీసులు

సాక్షి, మదనపల్లె టౌన్‌ : మహిళ హత్య కేసు మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధాలపై భార్య రోజూ నిలదీస్తోందనే ఆగ్రహంతో కట్టుకున్నోడే హంతకుడయ్యాడు. కత్తితో గొంతు కోసి దారుణంగా భార్యను హతమార్చాడు. నిందితుడు అంజాద్‌(36)ను శనివారం టూటౌన్‌ పోలీసులు అరెస్టు చేసినట్లు డీఎస్పీ ఎం.చిదానందరెడ్డి, సీఐ రాజేంద్రనాథ్‌ యాదవ్‌ విలేకరులకు వెల్ల డించారు. వారి కథనం.. స్థానిక తారకరామా సినిమా థియేటర్‌ సమీపంలోని నర్సింగ్‌హోం వీధిలో నివాసం ఉంటున్న దంపతులు అంజాద్, తహశీన్‌లది ఓ సాధారణ కుటుంబం. అంజాద్‌ మౌజాన్‌గా పని చేయడమే కాకుండా దుకాణం పెట్టుకుని మంత్రతంత్రాలు, క్షుద్ర పూజలు చేస్తూ సంపాదిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

వీరికి మూడేళ్ల లోపు వయసున్న ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. తన దుకాణానికి వచ్చిపోయే వారికి మంత్రాలు, తంత్రాలతో పాటు తాయత్తులు కడుతూ మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడు. ఇది తెలుసుకున్న తహశీన్‌ తన భర్తను పలుమార్లు మందలించినా అతడి తీరు మారలేదు.  విషయం తెలుసుకున్న ఇందిరానగర్‌లో నివాసం ఉంటున్న అంజాద్‌ తల్లి గురువారం ఉదయం కొడుకు, కోడలి వద్దకు వచ్చి ఇద్దరినీ మందలించింది. అయినా వారిద్దరూ ఆమె ఎదుటే మరోసారి గొడవ పడ్డారు. దీంతో వారికి సర్దిచెప్పలేక ఆమె తిరిగి ఆదే రోజు సాయంత్రమే తిరిగి ఇంటికి వెళ్లిపోయింది. అంజాద్‌ తన భార్య పరువు తీస్తోందని, ఆమె అడ్డు తొలగించుకోవాలని వ్యూహరచన చేశాడు. ఈ మేరకు తన ముగ్గురు పిల్లలను గురువారం సాయంత్రం ఇంటికి సమీపంలోని ఓ ట్యూషన్‌కు పంపేశాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న భార్యను పదునైన కత్తితో కిరాతకంగా గొంతుకోసి హతమార్చాడు.

అనంతరం ఎవరో ఆగంతకులు ఇంట్లో చొరబడి ఈ దురాగతానికి ఒడిగట్టారంటూ కథ అల్లాడు. రక్తపు మడుగులో పడివున్న భార్యను కాపాడేందుకు 108కు ఫోన్‌చేయాలని స్థానికులను కోరాడు. 108 సిబ్బంది అక్కడికి వచ్చే సరికే తహశీన్‌ చనిపోయిందని వారు వెనుదిరిగారు. సమాచారం అందడంతో టూటౌన్‌ పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. అంజాద్, కుటుంబ సభ్యులు చెప్పే పొంతన లేని సమాధానాలపై పోలీసులు అనుమానించారు.  చిత్తూరు నుంచి వేలి ముద్రల నిపుణులు, డాగ్‌ స్క్వాడ్‌ బృందం సంఘటనా స్థలంలో కీలక ఆధారాలు సేకరించింది. 24 గంటల వ్యవధిలోనే కేసును ఛేదించారు. తహశీన్‌ను ఆమె భర్తే కడతేర్చినట్లు విచారణలో తేలింది. ఈ హత్యకు ఎవరెవరు సహకరించారో దర్యాప్తులో తేలాల్సి ఉందని డీఎస్పీ చెప్పారు. హత్యకేసును గంటల వ్యవధిలోనే ఛేదించిన టూటౌన్‌ సీఐ, వన్‌ టౌన్‌ సీఐ తమీమ్‌ అహ్మద్, ఎస్‌ఐలు ఈ.బాబు, హరి హర ప్రసాద్‌తో పాటు సిబ్బందిని డీఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top