పొట్టిగా ఉందని..మట్టుబెట్టాడు!

Husband Assassinated Wife in Kurnool - Sakshi

భార్యతో సూసైడ్‌ నోట్‌ రాయించి.. ఆపై హత్య  

మరదలిపై వ్యామోహంతో దారుణం

వివాహిత హత్య కేసును ఛేదించిన పోలీసులు

జీవితాంతం తోడుంటానని తాళి కట్టిన భర్తే చివరికి కడతేర్చాడు. మరదలిపై వ్యామోహంతోనేఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. కేసును తప్పుదోవపట్టించేందుకు జీవితంపైవిరక్తితో ఆత్మహత్యచేసుకుంటున్నానంటూ తనతోనే మరణ వాంగ్మూలం రాయించి.. ఆపై కర్కశంగా హత్య చేశాడు.తన భార్య కనిపించడం లేదనినాటకమాడాడు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు.

కర్నూలు, ప్యాపిలి: భార్యను హత్య చేసిన కేసులో భర్తతో పాటు మరొక నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. నిందితుల వివరాలను సీఐ రామలింగమయ్య, రాచర్ల, ప్యాపిలి ఎస్‌ఐలు నగేశ్, మారుతీ శంకర్‌లు మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అలేబాదు తండాకు చెందిన రవి నాయక్‌కు బేతంచర్ల మండలం గోరుమాను కొండ తండాకు చెందిన సుశీలా బాయితో కొన్నేళ్ల  క్రితం వివాహమైంది. భార్య పొట్టిగా ఉండటంతో అవమానంగా భావించిన రవి నాయక్‌.. మరదలిపై(భార్య సోదరి) వ్యామోహం పెంచుకుని ఆమెను వివాహం చేసుకోవాలని భావించాడు. ఈ విషయంపై తరచూ భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగేది. భార్య ఉండగా రెండో పెళ్లి సాధ్యం కాదని భావించిన రవి నాయక్‌ ఆమెను మట్టుపెట్టడానికి సమీప బంధువు రేఖా నాయక్‌ సాయం తీసుకున్నాడు. (సంతానం కలగడం లేదని భార్యను..)

పథకం ప్రకారం రేఖా నాయక్‌ ద్వారా కట్టుకథ అల్లించి ‘జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నట్లు’ భార్యతోనే లేఖ రాయించాడు. ఈ లేఖను ఇంట్లో ఉంచి ఈ నెల 14 భార్యను తనతో పాటు జీవాలు మేపేందుకు అడవికి తీసుకెళ్లాడు. అక్కడ ముందుగానే ఎంచుకున్న ప్రదేశంలో రేఖా నాయక్‌తో కలసి సుశీలాబాయిపై బండరాయితో మోది హత్య చేశాడు. తర్వాత మృతదేహాన్ని లోయలోకి తోసి ఇంటికి వచ్చి తన భార్య కనిపించడం లేదని ‘ఆత్మహత్య చేసుకుంటున్నట్లు’ లేఖ రాసి ఉంచిందని బంధువులను నమ్మించాడు.  సూసైడ్‌ నోట్‌లో మృతురాలి చేతిరాత, సంతకం అన్నీ తమ కుమార్తెవని ఆమె తల్లిదండ్రులు ధ్రువీకరించినప్పటికీ అల్లుడిపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మరుసటి రోజు పశువుల కాపర్లు కొండల్లోని మహిళ మృతదేహం ఉన్న విషయాన్ని పోలీసులకు చెప్పడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఐ రామలింగమయ్య హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా మంగళవారం నిందితులను అరెస్ట్‌ చేసి విచారించగా నేరం అంగీకరించారు. ఈ మేరకు నిందితులను రిమాండ్‌కు పంపినట్లు సీఐ తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top