
సూర్యాపేట క్రైం: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఓ హెడ్‌కానిస్టేబుల్ అందరూ చూస్తుండగానే పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాలు ప్రకారం.. పట్టణానికి చెందిన దామోదర్‌రెడ్డి స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతని పెద్ద కుమారుడు విక్రమ్‌రెడ్డి భార్య సంధ్య కొంతకాలంగా తనను అత్తింటి వారు వేధిస్తున్నారని సూర్యాపేట రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో దామోదర్‌రెడ్డి, అతని భార్య, కుమారుడిపై పోలీసులు కేసు నమోదు చేసి ఈ నెల 14న స్టేషన్‌కు పిలిచారు.
ఈ సందర్భంగా ఎస్‌ఐ వారిపై చేయి చేసుకున్నట్లు బాధితుడి బంధువులు తెలిపారు. ఇదిలా ఉండగానే దామోదర్‌రెడ్డి శుక్రవా రం మధ్యాహ్నం పురుగు మందు తాగడంతో తోటి సిబ్బంది వెంటనే అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించారు. అంతకుముందు ఈ విషయం తెలుసుకున్న ఎస్పీ జాదవ్ ఆస్పత్రిలో దామోదర్‌రెడ్డిని పరామర్శించారు. కాగా, దామోదర్‌రెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సమయంలో జేబులోని సూసైడ్‌నోట్‌ను మాయం చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు.