కామాంధుడిపై నిర్భయ కేసు

Harrasments On Minor Girl Nirbhaya Case Filed - Sakshi

మైనర్‌ బాలికలతో అసభ్యంగా ప్రవర్తించిన వైనం

తెనాలి: ఇద్దరు మైనర్‌ బాలికలతో అసభ్యంగా ప్రవర్తించిన పానీపూరీ బండి నిర్వాహకుడిపై నిర్భయ కేసు నమోదైంది. తెనాలి త్రీ టౌన్‌ సీఐ అశోక్‌కుమార్‌ కథనం మేరకు.. స్థానిక పాండురంగపేటకు చెందిన నరసింహ (25) స్థానిక మద్రాస్‌ రైల్వే గేటు వద్ద పానీపూరీ విక్రయిస్తుంటాడు. అదే పేటకు చెందిన 10, 12 సంవత్సరాల మైనర్‌ బాలికలు అప్పుడప్పుడు పానీపూరీ తినేందుకు వస్తుంటారు. రెండు రోజుల క్రితం రాత్రి 7 గంటల సమయంలో బండి వద్దకు వచ్చిన ఆ బాలికలకు నరసింహ పానీపూరీ ఇచ్చాక, మాయమాటలు చెప్పి పక్కనే ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. వారికి రూ.10 ఇచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై ఆ బాలికల్లో ఒకరు బంధువులకు చెప్పగా, వారు బాలిక తల్లికి చెప్పారు. పిల్లలను ప్రశ్నించి, నిజం తెలుసుకున్న ఆ తల్లి, శనివారం రాత్రి పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసింది. దీంతో నరసింహపై పోలీసులు అత్యాచారం, నిర్భయ చట్టంతోపాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడు నరసింహ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలిసింది. నిందితుడికి వివాహమై ఇద్దరు పిల్లలున్నట్టు సమాచారం.

బాలికలకు జిల్లా కలెక్టర్, ఎస్పీ పరామర్శ
తెనాలిఅర్బన్‌: పానీ పూరీ బండి నిర్వాహకుడి బారిన పడిన ఇద్దరు చిన్నారులను జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్, రూరల్‌ జిల్లా ఎస్పీ వెంకటప్పలనాయుడులు ఆదివారం రాత్రి పరామర్శించారు. తెనాలి జిల్లా వైద్యశాలలో ఉన్న వారిని పరామర్శించి, బాలికల పరిస్థితిని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సనత్‌కుమారిని అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని బాలికలకు సూచించారు. బాలికలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన నష్టపరిహరాన్ని వెంటనే ఇప్పించాలని జిల్లా కలెక్టర్‌ శశిధర్‌ ఆర్డీవో జి నరసింహులును ఆదేశించారు. నిందితుడిపై ఎస్సీ,ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేయాలని డీఎస్పీ ఎం స్నేహితను ఆదేశించారు. బాలికలు ఏ పాఠశాలలో చదవదలిచారో అక్కడ చదివించాలని ఆర్డీవోకు సూచించారు. వారి వెంట పలువురు రెవిన్యూ, పోలీస్‌ అధికారులు ఉన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top