ప్రియురాలికి ఆస్తి రాసిచ్చేస్తాడని భర్తను కడతేర్చింది.. | Gurugram Woman Hires Contract Killers To Murder Husband | Sakshi
Sakshi News home page

ప్రియురాలికి ఆస్తి రాసిచ్చేస్తాడని భర్తను కడతేర్చింది..

Jan 22 2019 9:31 AM | Updated on Jan 22 2019 1:57 PM

Gurugram Woman Hires Contract Killers To Murder Husband - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

అనుమానంతో భర్తను మట్టుబెట్టిన భార్య

గుర్‌గావ్‌ : వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో కట్టుకున్న భర్తనే కిరాయి ముఠాతో కడతేర్చిన ఇల్లాలి ఉదంతం వెలుగుచేసింది. తన భర్త ఓ మహిళతో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడని, మొత్తం ఆస్తి ఆమె పేరున బదిలీ చేస్తాడనే అనుమానంతో కిరాయి హంతకులతో భర్తను హతమార్చానని పోలీసుల ఎదుట ఆమె అంగీకరించారు. ఈనెల 17న అదృశ్యమైన స్వీటీ భర్త జోగీందర్‌ సింగ్‌ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ద్వారకా ఎక్స్‌ప్రెస్‌ వే సమీపంలోని బజ్‌గేరా ప్రాంతంలోని కాలువలో గోనెసంచీలో గుర్తించిన మృతదేహం సింగ్‌దేనని పోలీసులు గుర్తించారు. కాలువ వద్ద ఓ మోటార్‌ సైకిల్‌నూ స్వాధీనం చేసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారణను చేపట్టడంతో వాస్తవాలు వెలుగు చూశాయి.

కాగా, తమ సోదరుడి మృతికి వదినే కారణమని సింగ్‌ సోదరుడు తెలపడంతో పోలీసులు ఆమెను పలు కోణాల్లో ప్రశ్నించారు. పోలీసుల విచారణలో భర్తను తానే కిరాయి హంతకులతో హత్య చేయించానని స్వీటీ అంగీకరించారు. భర్త తన ఆస్తి మొత్తాన్ని ప్రియురాలికి రాసిస్తాడనే భయంతోనే తాను ఆయనను చంపించినట్టు వెల్లడించారు.

హంతకుల ముఠాకు రూ 16 లక్షలతో ఒప్పందం చేసుకుని రూ 2.5 లక్షలను అడ్వాన్స్‌గా ముట్టచెప్పినట్టు ఆమె తెలిపారు. ఇక ముందుగా వేసుకున్న పథకం ప్రకారం జనవరి 16 అర్ధరాత్రి స్వీటీ ఇంటిలోకి ప్రవేశించిన హంతకులు నిద్రిస్తున్న ఆమె భర్తను దారుణంగా హతమార్చి శవాన్ని గోనెసంచీలో కుక్కి కాలువలో పడేశారని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో స్వీటీని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరో ఆరుగురు నిందితులు పరారీలో ఉన్నారని త్వరలో అందరినీ అదుపులోకి తీసుకుంటామని గుర్‌గావ్‌ పోలీస్‌ అధికార ప్రతినిధి సుభాష్‌ బొకాన్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement