breaking news
guragon metro station
-
ప్రియురాలికి ఆస్తి రాసిచ్చేస్తాడని భర్తను కడతేర్చింది..
గుర్గావ్ : వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో కట్టుకున్న భర్తనే కిరాయి ముఠాతో కడతేర్చిన ఇల్లాలి ఉదంతం వెలుగుచేసింది. తన భర్త ఓ మహిళతో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడని, మొత్తం ఆస్తి ఆమె పేరున బదిలీ చేస్తాడనే అనుమానంతో కిరాయి హంతకులతో భర్తను హతమార్చానని పోలీసుల ఎదుట ఆమె అంగీకరించారు. ఈనెల 17న అదృశ్యమైన స్వీటీ భర్త జోగీందర్ సింగ్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే సమీపంలోని బజ్గేరా ప్రాంతంలోని కాలువలో గోనెసంచీలో గుర్తించిన మృతదేహం సింగ్‌దేనని పోలీసులు గుర్తించారు. కాలువ వద్ద ఓ మోటార్ సైకిల్‌నూ స్వాధీనం చేసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారణను చేపట్టడంతో వాస్తవాలు వెలుగు చూశాయి. కాగా, తమ సోదరుడి మృతికి వదినే కారణమని సింగ్ సోదరుడు తెలపడంతో పోలీసులు ఆమెను పలు కోణాల్లో ప్రశ్నించారు. పోలీసుల విచారణలో భర్తను తానే కిరాయి హంతకులతో హత్య చేయించానని స్వీటీ అంగీకరించారు. భర్త తన ఆస్తి మొత్తాన్ని ప్రియురాలికి రాసిస్తాడనే భయంతోనే తాను ఆయనను చంపించినట్టు వెల్లడించారు. హంతకుల ముఠాకు రూ 16 లక్షలతో ఒప్పందం చేసుకుని రూ 2.5 లక్షలను అడ్వాన్స్‌గా ముట్టచెప్పినట్టు ఆమె తెలిపారు. ఇక ముందుగా వేసుకున్న పథకం ప్రకారం జనవరి 16 అర్ధరాత్రి స్వీటీ ఇంటిలోకి ప్రవేశించిన హంతకులు నిద్రిస్తున్న ఆమె భర్తను దారుణంగా హతమార్చి శవాన్ని గోనెసంచీలో కుక్కి కాలువలో పడేశారని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో స్వీటీని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఆరుగురు నిందితులు పరారీలో ఉన్నారని త్వరలో అందరినీ అదుపులోకి తీసుకుంటామని గుర్గావ్ పోలీస్ అధికార ప్రతినిధి సుభాష్ బొకాన్ తెలిపారు. -
భూమ్మీద నూకలు మిగిలి ఉంటే..
-
భూమ్మీద నూకలు మిగిలి ఉంటే..
ఆమె ఓ వైద్యురాలు. వయసు దాదాపు 27 సంవత్సరాలు. ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఏం కష్టం వచ్చిందో ఏమో గానీ.. గుర్గావ్లోని మెట్రోస్టేషన్లో రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారు. అప్పటివరకు ప్లాట్‌ఫాం మీద అటూ ఇటూ నడుస్తూ ఉన్న ఆమె.. రైలు రాగానే ఒక్కసారిగా దాని ముందు పట్టాల మీదకు దూకారు. ఆమె చేతిలో ఒక బ్యాగ్ కూడా ఉంది. అయితే భూమ్మీద ఇంకా నూకలు మిగిలి ఉండటంతో తీవ్రంగా గాయపడి ప్రాణాలతో బయటపడ్డారు. సోమవారం ఉదయం సమయంలో గురు ద్రోణాచార్య మెట్రో స్టేషన్లో ఈ ఘటన జరగడంతో దాదాపు పది నిమిషాల పాటు రైలు సర్వీసులకు అంతరాయం కలిగింది. అది ఆత్మహత్యా ప్రయత్నం కాదని రైల్వే అధికారులు అంటున్నారు గానీ, సీసీ టీవీ ఫుటేజి చూస్తే మాత్రం ఆమె సరిగ్గా రైలు వచ్చే సమయానికే పట్టాల మీదకు దూకినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఆమెకు పలు ఫ్రాక్చర్లు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి బాగానే ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అయితే.. పోలీసులకు వాంగ్మూలం ఇవ్వడానికి మాత్రం ఇంకా ఆమె ఆరోగ్యం సహకరించడం లేదని, ఆమె కోలుకోగానే ఎందుకు ఆత్మహత్యాయత్నం చేశారో తెలుసుకునే ప్రయత్నం చేస్తామని పోలీసులు అంటున్నారు.