ఆమె ఓ వైద్యురాలు. వయసు దాదాపు 27 సంవత్సరాలు. ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఏం కష్టం వచ్చిందో ఏమో గానీ.. గుర్‌గావ్‌లోని మెట్రోస్టేషన్‌లో రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారు. అప్పటివరకు ప్లాట్‌ఫాం మీద అటూ ఇటూ నడుస్తూ ఉన్న ఆమె.. రైలు రాగానే ఒక్కసారిగా దాని ముందు పట్టాల మీదకు దూకారు. ఆమె చేతిలో ఒక బ్యాగ్ కూడా ఉంది. అయితే భూమ్మీద ఇంకా నూకలు మిగిలి ఉండటంతో తీవ్రంగా గాయపడి ప్రాణాలతో బయటపడ్డారు. సోమవారం ఉదయం సమయంలో గురు ద్రోణాచార్య మెట్రో స్టేషన్‌లో ఈ ఘటన జరగడంతో దాదాపు పది నిమిషాల పాటు రైలు సర్వీసులకు అంతరాయం కలిగింది.