రెప్పపాటులో ఘోరం..

Girl Child Death in Lorry Accident Vizianagaram - Sakshi

రోడ్డు దాటుతున్న చిన్నారిని ఢీకొన్న లారీ

ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూత

కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు, బంధువులు

కొమరాడ: రెప్పపాటులో ఘోరం జరిగిపోయింది. శుభకార్యానికి వచ్చిన చిన్నారి లారీ ప్రమాదంలో కన్నుమూసింది. కళ్లముందే ఘోరం జరిగిపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కురుపాం మండలం జోగిరాజుపేట గ్రామానికి చెందిన నరాల రాజు, మాధురి దంపతులు విశాఖలో స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో ఇటీవలే సొంత గ్రామానికి వచ్చారు. ఈ క్రమంలో విక్రమపురంలోని బంధువుల ఇంటిలో జరగనున్న శుభకార్యంలో పాల్గొనేందుకు బుధవారం గ్రామానికి వచ్చారు. రెండో సంతానమైన హరిణిక (8) విక్రంపురం వద్ద జాతీయ రహదారి దాటుతుండగా.. పార్వతీపురం నుంచి ఒడిశా వైపు అతివేగంగా వెళ్తున్న లారీ చిన్నారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారిని వెంటనే పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో కన్నుమూసింది. రోడ్డు ప్రమాదంలో కళ్లముందే చిన్నారి చనిపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. కొమరాడ ఎస్సై రాజేష్‌ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇలాంటి సంఘటనలెన్నో....?
కొమరాడ మండలంలోని విక్రంపురం గ్రామం మీదుగా జాతీయ రహదారి వెళ్తుండడంతో వాహనాల రాకపోకలు పెరిగాయి.అతివేగంతో వాహనాలు రాకపోకలు సాగిస్తుండడంతో రోడ్డు మీదకు రావడానికే ప్రజలు భయపడుతున్నారు.  గ్రామం వద్ద స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని పలుమార్లు అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా ఎవ్వరూ పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులను  గ్రామస్తులు నిలదీశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top