పెళ్లి పేరుతో టోకరా

Fraud And Cyber Crime With Fake Wedding Profile - Sakshi

రూ. నాలుగు లక్షలు వసూలు కేసు నమోదు

సాక్షి, సిటీబ్యూరో: ఆన్‌లైన్‌ కేంద్రంగా అన్ని అర్హతలు ఉన్న వధువు, వరుడి పేరుతో ఎర వేసి అందినకాడికి దండుకునే సైబర్‌ నేరగాళ్లు నానాటికీ రెచ్చిపోతున్నారు. తాజాగా అంబర్‌పేట్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ రూ.4 లక్షలు పోగొట్టుకుని సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్న ఓ యువతికి భారత్‌ మ్యాట్రిమోని సైట్‌ ద్వారా బినయ్‌ మనీష్‌ పేరుతో ఉన్న వ్యక్తి తన ఐడీ ద్వారా పెళ్లి ప్రస్తావన చేశాడు. తాను లండన్‌లో ఉద్యోగం చేస్తున్నానని త్వరలోనే ఇండియాకు వచ్చి పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్లు ఆన్‌లైన్‌ ద్వారానే చెప్పాడు. ఒకరి ప్రొఫైల్‌ మరొకరికి నచ్చడంతో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఆ తర్వాత ఇరువురు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఓ రోజు హఠాత్తుగా తాను ఇండియాకు వచ్చేస్తున్నానని చెప్పిన బినయ్‌... అంతకు ముందే 50 వేల పౌండ్ల విలువైన బహుమతిని పంపిస్తున్నట్లు ఎర వేశాడు. ఆ మర్నాడు ఏపీసీ కొరియర్‌ కంపెనీ పేరుతో ఆమెకు ఫోన్‌ వచ్చింది. మీ పేరుతో వచ్చిన పార్శిల్‌లో విలువైన వస్తువులు గుర్తించామంటూ పేర్కొన్న అవతలి వ్యక్తులు, అందుకు సంబందించి రూ. 25 వేలు ఫీజు చెల్లించాలని కోరారు. ఇలా వివిధ దఫాల్లో అనేక పేర్లు చెప్పి ఆమె నుంచి రూ.1.3 లక్షలు వివిధ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్‌ చేయించుకున్నారు.  ఆ తర్వాతి రోజు కస్టమ్స్‌ అధికారులమంటూ ఆమెకు కాల్‌ చేసిన ఆగంతకులు ఆ పార్శిల్‌లోని వస్తువులకు అనుమతులు లేవని అది నేరమని భయపెట్టారు. అందుకే పార్శిల్‌ను బ్లాక్‌ చేస్తున్నట్లు తెలిపారు. వాటిని రిలీజ్‌ చేసుకోవాలంటే రూ. 3.5 లక్షలు చెల్లించాలని స్పష్టం చేశారు. దీంతో బాధితురాలు ఈ నెల 6, 7 తేదీల్లో మరికొన్ని ఖాతాల్లోకి మరో రూ.3.3 లక్షలు డిపాజిట్‌ చేశారు. ఆ పార్శిల్‌లో కొంత విదేశీ కరెన్సీ కూడా గుర్తించామని మరోసారి కాల్‌ చేసిన కేటుగాళ్లు మరో రూ.1.95 లక్షలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వచ్చిన మెయిల్‌లో ఆర్బీఐ పేరుతో ఉన్న లేఖ నకిలీదిగా గుర్తించిన ఆమె జరిగిన మోసాన్ని గ్రహించారు. బాధితురాలి ఫిర్యాదుతో సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Read also in:
Back to Top